తెలంగాణ

telangana

YS SHARMILA: ప్రతి మంగళవారం.. నిరుద్యోగ వారం

By

Published : Jul 13, 2021, 10:56 AM IST

Updated : Jul 13, 2021, 11:36 AM IST

Sharmila initiates unemployment hunger strike

నిరుద్యోగులకు అండగా ప్రతీ మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటిస్తున్నట్టు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS SHARMILA) తెలిపారు. వనపర్తి జిల్లాలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఉదయం వనపర్తి జిల్లాకు చేరుకున్న షర్మిల.. తాడిపర్తి గ్రామంలో నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించి దీక్షలో కూర్చున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS SHARMILA) పర్యటించారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులు.. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కుమారుని మృతితో గుండెలవిసేలా రోదిస్తున్న వారిని షర్మిల ఓదార్చారు. వారి కడుపుకోత చూసి షర్మిల కంటతడి పెట్టారు. అనంతరం కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్​కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు.

షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై వైఎస్ షర్మిల(YS SHARMILA) నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకు వారికి భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తుంది వైఎస్సార్​టీపీ. నిరుద్యోగులకు అండగా మేం నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎవరు చచ్చినా.. నాకేంటి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటంన్నింటిని భర్తీ చేయాలి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తొలగే వరకు వైఎస్సార్​టీపీ పోరాటం కొనసాగుతుంది.

- వైఎస్ షర్మిల(YS SHARMILA), వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

Last Updated :Jul 13, 2021, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details