తెలంగాణ

telangana

Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం

By

Published : Sep 11, 2021, 12:36 PM IST

వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం

డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే బృహత్​ కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభమైంది. మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు(Medicine from the sky) పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా దీనికి శ్రీకారం చుట్టారు.

దేశంలో తొలిసారి.. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే బృహత్ కార్యక్రమం తెలంగాణలో అమలవుతోంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు(Medicine from the sky) ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లాలో మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్​లో డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేశారు. ఇందులో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు ఔషధాలు రవాణా చేయడం కోసమే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సుమారు 40 కిలోమీటర్ల వరకు డ్రోన్ ప్రయాణిస్తుంది. ఒక్క డ్రోన్​లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంటుంది. నాణ్యత దెబ్బతినకుండా డ్రోన్​లో 4 వేర్వేరు బాక్సుల్లో మందులు సరఫరా చేస్తారు. భూమికి 500-700 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణించనుంది.

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో.. మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు(Medicine from the sky)కు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో.. ఐటీశాఖ జట్టు కట్టింది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ ఫ్లైట్ల(DRONE FLIGHTS) ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ABOUT THE AUTHOR

...view details