తెలంగాణ

telangana

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటివెలుగు కార్యక్రమం.. ప్రారంభించిన మంత్రులు

By

Published : Jan 19, 2023, 11:35 AM IST

Kanti Velugu
Kanti Velugu ()

Kanti Velugu Second Phase in Telangana: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ తెచ్చిన ఎన్నో పథకాలు నేడు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో పాల్గొని అద్దాలు పంపిణీ చేస్తున్నారు.

Kanti Velugu Second Phase in Telangana: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న ఖమ్మంలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగ్గా.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో పాల్గొని అద్దాలు పంపిణీ చేస్తున్నారు.

హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని వివేకానంద కమ్యూనిటీహాల్‌లో కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి తలసానితో కలిసి... వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నేత్ర పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడిన మంత్రులు... ఈ సందర్భంగా పలువురికి అద్దాలు పంపిణీ చేశారు. నివారించదగిన అంధత్వరహిత తెలంగాణే కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ హరీశ్‌రావు తెలిపారు. నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఎంలు... కంటి వెలుగు కార్యక్రమాన్ని వారి రాష్ట్రాల్లో అమలుచేస్తామనటం తెలంగాణకు గర్వకారణమన్నారు.

కళ్లద్దాలను ఏఎన్‌ఎంలు ఇంటికే తెచ్చి ఇస్తారు: కేసీఆర్‌ సర్కార్‌ తెచ్చిన ఎన్నో పథకాలు నేడు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మంత్రి హరీశ్​రావు తెలిపారు. కంటి పరీక్షలు చేసి అవసరమైన కళ్లద్దాలను ఏఎన్‌ఎంలు ఇంటికే తెచ్చి ఇస్తారని హరీశ్​రావు స్పష్టం చేశారు. కంటిచూపు కోసం ఇంతటి భారీ కార్యక్రమం ఎవరూ చేపట్టలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఈ మహత్తర కార్యక్రమం చేపట్టారని తలసాని తెలిపారు.

'రాష్ట్రంలో ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం. నిన్న రాష్ట్రానికి వచ్చిన ఇతర రాష్ట్రాల సీఎంలు మన పథకాలను ప్రశంసించారు. తెలంగాణ తెచ్చిన పథకాలనే నేడు అనేక రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తున్నాయి. తెలంగాణను పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు అనుసరించటం మనకు గర్వకారణం.'-హరీశ్​రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే దృఢ నిశ్చయంతో సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గోపితో కలసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్ష మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని, శరీరంలోని అన్ని అవయవాల కన్నా కళ్లు అత్యంత ప్రధానమైనవని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం రాజీవ్ నగర్​లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడుతో కలిసి ఎమ్మెల్యే దివాకర్ రావు కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమంతో అంధత్వం నుంచి ఎంతోమంది నివారణ పొందాలని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాలలో 300, పట్టణ ప్రాంతాలలో 400 మందికి పరీక్షలు నిర్వహిస్తామని సుబ్బారాయుడు తెలిపారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టామని 45 వైద్య బృందాలు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తాయని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం గొప్ప కార్యక్రమం.. పట్టణాలకు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకునే స్థోమత లేని గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎంత ఉపయోగకరమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details