తెలంగాణ

telangana

Gajwel constituency : రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్న కేసీఆర్ ఇలాకా

By

Published : Sep 6, 2021, 12:39 PM IST

రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్న కేసీఆర్ ఇలాకా

తెలంగాణకే ఆదర్శంగా నిలవనుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా.. గజ్వేల్ నియోజకవర్గం(Gajwel constituency). ఈ ప్రాంతాన్ని అతిపెద్ది వాణిజ్య హబ్​గా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గజ్వేల్ పరిధిలో రాష్ట్ర సర్కార్.. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా చుట్టూ నిర్మించి బాహ్యవలయ రహదారిని 338 కిలోమీటర్లతో హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో ప్రగతిపథంలో దూసుకుపోతున్న గజ్వేల్‌ నియోజకవర్గం(Gajwel constituency) అతిపెద్ద వాణిజ్య హబ్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విద్య, వైద్య సదుపాయాలతో పాటు భారీ నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచే రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) నిర్మాణానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 338 కిలోమీటర్లతో హైదరాబాద్‌ చుట్టూ నిర్మించే ట్రిపుల్‌ ఆర్‌కు గజ్వేల్‌ పరిధిలో రూ.223 కోట్లతో ప్రభుత్వం గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా చుట్టూ నిర్మించిన బాహ్య వలయ రహదారికి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా భూసేకరణ చేపట్టాల్సిన అవసరం లేకుండానే ప్రాంతీయ వలయ రహదారిని పూర్తి చేసే అవకాశం ఉండటంతో ఈ మేరకు తీర్మానించినట్లు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ వెలుపల నుంచి శివారు ప్రాంతాలైన ఉమ్మడి మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగు రోడ్డు) నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోడ్డు ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో తూప్రాన్‌, గజ్వేల్‌(Gajwel constituency), ప్రజ్ఞాపూర్‌, జగదేవపూర్‌ మీదుగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న రహదారులతో సంబంధం లేకుండా భారీ వెడల్పుతో నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గజ్వేల్‌ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాల భూ నిర్వాసితులు తిరిగి ఇక్కడే ఇళ్ల స్థలాలు, సాగు భూములు కొనుగోలు చేయగా ఇపుడిపుడే కుదుట పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణానికి మళ్లీ భూమిని సేకరిస్తే అంతా నష్టపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న వలయ రహదారిని విస్తరిస్తే పెద్దగా నష్టం వాటిల్లదన్న అభిప్రాయంతో జాతీయ రహదారుల అథారిటీ అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం..

పనుల పునఃప్రారంభంలో ఆలస్యానికి కారణం అదేనా..

గజ్వేల్‌(Gajwel constituency)-ప్రజ్ఞాపూర్‌ చుట్టూ 23 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రింగు రోడ్డు 4 కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉండిపోయింది. ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం గత నెలలో రూ.118 కోట్లతో రీ టెండర్‌ నిర్వహించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రీజినల్‌ రింగు రోడ్డు అంశం పరిశీలనలోకి వచ్చిన నేపథ్యంలో పాత పనులు చేపట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిమ్మనగూడ నుంచి క్యాసారం, గజ్వేల్‌ మీదుగా తూప్రాన్‌ రోడ్డును కలిపే రహదారిని విస్తరించి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం చేసేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఎగుమతులు, దిగుమతులు జరిగేలా గూడ్స్‌ రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు గజ్వేల్‌ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంను నిర్మిస్తున్నారు. గజ్వేల్‌ రింగురోడ్డుకు సమీపంలోనే అంతర్జాతీయ స్థాయిలో క్రీడా గ్రామం నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవలే రూ.2 కోట్లు మంజూరు చేసింది. మొత్తానికి ఆర్‌ఆర్‌ఆర్‌, రైల్వే సౌకర్యం, సాగునీటి ప్రాజెక్టుల ఆలంబనతో గజ్వేల్‌ మహా వాణిజ్య హబ్‌గా మారి నిరుద్యోగుల ఉపాధికి ఊతమివ్వనుంది.

ABOUT THE AUTHOR

...view details