తెలంగాణ

telangana

Singoor project: తొలిసారి జులైలోనే నిండుకుండలా సింగూరు.. అన్నదాతల హర్షం

By

Published : Jul 31, 2022, 7:42 PM IST

Singoor project

Singoor project: మెతుకు సీమ జీవధార మంజీర నది.. జలకళ సంతరించుకుంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలయ్యాయి. ప్రధాన ఆనకట్ట సింగూర్ చరిత్రలో.. తొలిసారి జులై మాసంలోనే పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల అన్నదాతలు ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Singoor project: మంజీర నదిపై సంగారెడ్డి జిల్లాలో సింగూర్ శివారులో మంజీరా నదిపై 1974లో 30టీఎంసీల సామర్థ్యంతో.. బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణం 15 ఏళ్ల పాటు కొనసాగగా.. 1989లో నీటిని నిల్వచేయడం ఆరంభించారు. సాధారణంగా సింగూర్ ప్రాజెక్టులోకి ఆగస్టు నెలాఖరు నుంచి వరద ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ - అక్టోబర్ మాసాల్లో పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుంది. రాష్ట్రంలోని అన్నీ ప్రాజెక్టులు నిండినా.. ఇది వెలవెలబోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం చరిత్రలో మొట్టమొదటిసారి జులైలోనే పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది.

ఈ సీజన్ ప్రారంభానికి ముందు సింగూర్ ప్రాజెక్టులో 20.4టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కేవలం జులై మాసంలోనే 18టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇప్పటి వరకు 10టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 28.5టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకుని.. గేట్లను మూసి వేశారు. ఎగువ నుంచి 4 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 2 వేల 400క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా... దిగువకు విడుదల చేస్తున్నారు. గతంలో దిగువన ఉన్న 17గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ అనుభవాలతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల తాగు సాగు నీటికి సింగూర్ ప్రాజెక్టే ప్రధాన వనరు. ఇక్కడి నుంచి జంట నగరాలకు సైతం తాగు నీరు సరఫరా అవుతుంది. సింగూర్ కాలువలను సంగారెడ్డి జిల్లాలోని.. వందలాది చెరువులకు అనుసంధానించారు. చెరువులను నింపి వాటి కింద ఉన్న ఆయకట్టును సైతం స్థిరీకరించారు. సింగూర్ నిండటంతో తమకు మూడు పంటలకు ఢోకా లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్టు మెతుకు సీమలో.. వెలుగులు సైతం నింపనుంది. ఇక్కడ ఉన్న 15మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.. గత సంవత్సరం రికార్డు స్థాయిలో17.5మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేయగా.. ఆ రికార్డును ఈ సంవత్సరం అధిగమించే అవకాశం ఉంది.

సింగూరు జలసిరులు.. అన్నదాతల హర్షం

ఇవీ చదవండి:సబిత ఇంటివద్ద తల్లిదండ్రుల ఆందోళన.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

అలవోకగా 'లా'.. ఒకేసారి 11 గోల్డ్​ మెడల్స్​తో పల్లవి సత్తా.. చూపు లేకపోయినా..

ABOUT THE AUTHOR

...view details