తెలంగాణ

telangana

Deers destroying crops: చెంగు చెంగున ఎగురుతూ.. పంట నష్టం చేస్తున్నాయ్‌

By

Published : Nov 7, 2021, 1:36 PM IST

Deers

చెంగుచెంగున గెంతుతూ పరుగులు తీసే జింకలను చూస్తుంటే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కేరింతలు కొడతారు. కానీ నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు వాటిని చూస్తే చాలు వామ్మో అంటున్నారు. పొలాల్లో గెంతుతూ పత్తి, వరి, కంది పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి వాటిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జింకలు

నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జింకలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలాల్లో గుంపులుగా తిరుగుతుండటం వల్ల పంట దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్తల్, ఊట్కూరు, నర్వ, మాగనూర్, క్రిష్ణా మండలాల్లో ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరాయి. చాలా గ్రామ శివారుల్లో జింకలు గొర్రెల మందలను తలపిస్తున్నాయి. పొలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ చూసిన గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. జింకలు మందలుగా వచ్చి... పత్తి, కంది, ఆముదం, వరి ఇలా ఏ పంటనూ వదలడంలేదని... మొక్క దశలోనే తుంచేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసినప్పట్నుంచి కోతకోసే వరకు పొలాల వద్ద రేయింబవళ్లు కాపలా కాయాల్సి వస్తోందని వాపోయారు.

గత ఏడాది సాగు చేసిన పంటల్లో సగం వరకు జింకలకే ఆహారంగా మారాయని రైతులు పేర్కొన్నారు. దీంతో పంటలు సాగు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. తక్షణమే వాటికోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించి జింకల పార్కులను ఏర్పాటు చేసి వాటిని సంరక్షించాలని కోరారు.

మా దగ్గర జింకలు గొర్రెల మందలను తలపిస్తున్నాయి. పెట్టిన పంటను పెట్టినట్లు నాశనం చేస్తున్నాయి. కాస్త పెద్ద మొక్కగా మారే వరకూ కాపాడుకుంటూ వచ్చినా తింటున్నాయి. వేల ఎకరాల విస్తీర్ణంలో ఇవి సంచరిస్తూ ఎక్కడ ఏ పంట ఉన్నా కాపుకచ్చే సమయానికి తినేస్తున్నాయి. మా పెట్టుబడి కూడా మాకు వచ్చేలా లేదు. విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, రైతు

నేను 14 ఎకరాల్లో కందులు వేశాను. కంది కానీ, పత్తి గానీ జింకల మందలు దాడి చేయడంతో దక్కడం లేదు.రెండు మూడు సార్లు పంటలు వేసినా జింకలు తినేస్తున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలి. తక్షణమే వాటికోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి. లేదంటే వాటిని నల్లమల అడవుల్లో వదలి... మాకు అధికారుల న్యాయం చేయాలి. బాధిత రైతు

ఇదీ చదవండి:Niranjan Reddy On Rice Crop: యాసంగిలో వరి కొనుగోళ్లపై మంత్రి కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details