తెలంగాణ

telangana

Padma Sri Award To Mogilayya: కిన్నెర రాగానికి పులకరించి.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ..

By

Published : Jan 25, 2022, 8:22 PM IST

Updated : Jan 25, 2022, 10:54 PM IST

Kinnera Mogulayya
Kinnera Mogulayya

20:18 January 25

Padma Sri Award To Mogilayya: దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం..

పన్నెండు మెట్ల కిన్నెరతో మొగిలయ్య

Padma Sri Award To Mogilayya: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల జాబితాలో తెలంగాణకు చెందిన అరుదైన కళను బతికిస్తూన్న దర్శనం మొగిలయ్య పేరు కూడా ఉంది. వైవిధ్యమైన ప్రాచీన కళ అయిన పన్నెండు మెట్ల కిన్నెర పలికించే రాగానికి పులకరించిన పద్మశ్రీ పురస్కారం.. మొగిలయ్యను వరించింది.

పాఠ్యాంశంగా మొగిలయ్య ప్రతిభ..

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగిలయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య.. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాధలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది.

కిన్నెరకు కష్టాల రాగాలు..

ఈ గుర్తింపుతో మొగిలయ్య మనసైతే సంతసించింది కానీ.. కడుపు నిండలేదు. కళాకారుల పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు. ఆసరా పింఛను అడిగితే వయసు చాలదన్నారు. మొగిలయ్య భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. పెద్ద కొడుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. మూడో కుమారుడు పదోతరగతి చదువుతుండగా, రెండో కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. అతడి వైద్యానికి నెలకు రూ.4 వేల వరకూ ఖర్చవుతోంది.

కరోనాతో బిక్షమెత్తుకునే దుస్థితి..

అప్పటి వరకు అక్కడక్కడా వాయిద్య ప్రదర్శనలతో పొట్టపోసుకున్న మొగులయ్యను కరోనా రోడ్డుపైకి లాగింది. ప్రదర్శనలకు అవకాశం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమైంది. దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక ఆయన నలుగురినీ యాచించాల్సిన స్థితి. పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించిన మొగిలయ్య దుస్థితిని 'ఈనాడు- ఈటీవీ భారత్​'.. ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడుశీర్షికతో ప్రచురించింది.

భీమ్లా నాయక్​ పాటతో ఫేమస్​..

ఈ కథనంతో.. మొగిలయ్య పరిస్థితిని తెలుసుకున్న చాలా మంది.. తోచినంతలో ఆర్థికసాయం చేశారు. స్పందించిన ప్రభుత్వం ప్రత్యేకంగా.. కళాకారుల ఫించను రూపంలో.. రూ.10వేల సాయాన్ని అందిస్తోంది. మొగిలయ్య గురించి విన్న పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​ 'భీమ్లా నాయక్' చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్​గా మారిపోయారీ కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన తన ఆర్థిక స్థోమత గురించి ప్రస్తావించారు. దీంతో ముందుకొచ్చిన పవన్.. మొగిలయ్యకు రూ.2 లక్షల సాయం అందించారు.

కళారంగంలో మరో ఇద్దరికి..

ఇలా వైవిద్యమైన కళకు ప్రాణం పోస్తూ.. బావితరాలకు తెలియజేస్తున్న మొగిలయ్య కృషిని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం.. కళా రంగంలో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించటం అభినందనీయం. దర్శనం మొగిలయ్యతో పాటు కళా రంగంలో.. తెలంగాణకు చెందిన రామచంద్రయ్య, పద్మజా రెడ్డికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

ఏపీలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు..

  • గరికపాటి నరసింహారావు ‍‌(ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
  • గోసవీడు షేక్‌ హసన్‌ (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
  • డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు

ఇదీ చదవండి :

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated :Jan 25, 2022, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details