తెలంగాణ

telangana

RAMAPPA TEMPLE: రామప్పను చూతము రారండి..

By

Published : Jul 28, 2021, 7:02 AM IST

regular-bus-trips-from-hyderabad-to-ramappa-temple

రామప్ప ఆలయానికి (RAMAPPA TEMPLE) యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చినప్పటి నుంచి ఆలయ అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TS TDS) దృష్టి సారిస్తోంది. ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం హైదరాబాద్‌ నుంచి నిత్యం బస్సు యాత్రలు ప్రారంభించబోతోంది. అలాగే సందర్శకులు బస చేసేందుకు వీలుగా పాలంపేటలో వంద గదులతో హరిత హోటల్‌ను నిర్మించబోతున్నారు.

ఖండాంతరాలకు ఖ్యాతి విస్తరించిన రామప్ప ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం సౌకర్యాలు, వసతుల కల్పనపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌ టీడీసీ) దృష్టి సారిస్తోంది. హైదరాబాద్‌ నుంచి నిత్యం బస్సు యాత్రలు నిర్వహించడంతో పాటు రామప్ప ఆలయం ఉన్న ములుగు జిల్లా పాలంపేటలో వంద గదులతో భారీ హరిత హోటల్‌ నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. రామప్పతోపాటు యాదాద్రి ఆలయం, భువనగిరి కోటనూ సందర్శించేలా ప్రత్యేక ప్యాకేజీల రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తోంది.

రెండు రకాల ప్యాకేజీలకు యోచన...

హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు బస్సు యాత్రలు చేపట్టేందుకు టీడీసీ సన్నాహాలు చేస్తోంది. మొదటి ప్యాకేజీలో హైదరాబాద్‌ నుంచి బయల్దేరి భువనగిరిలో ఖిల్లాను చూసి అటునుంచి యాదాద్రికి, అక్కడ దర్శనం పూర్తయ్యాక పాలంపేటకు వెళ్లి రామప్ప ఆలయ కట్టడం వీక్షణ, దర్శనం. రాత్రి అక్కడ లేదా వరంగల్‌లో బస. మరుసటిరోజు ఉదయం అక్కడినుంచి బయల్దేరి హైదరాబాద్‌కు పయనం. రెండో ప్యాకేజీలో హైదరాబాద్‌ నుంచి నేరుగా పాలంపేట రామప్ప ఆలయానికి. అదే రోజు రాత్రిలోగా హైదరాబాద్‌కు తిరిగివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పాలంపేటలో ప్రస్తుతం 1.04 ఎకరాల విస్తీర్ణంలో హరిత హోటల్‌ ఉంది. ఇందులో 12 గదులున్నాయి. పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాతో 100 గదుల వరకు వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

సీఎం దృష్టికి ప్రణాళికలు..

యునెస్కో గుర్తింపుతో రామప్పకు పర్యాటకులు బాగా పెరుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సదుపాయాల కల్పన, ఉన్న వాటి అభివృద్ధితో పాటు పర్యాటక ప్యాకేజీలపై కసరత్తు చేస్తున్నాం. మా ప్రణాళికల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఉన్నతాధికారులతో కలిసి ముందుకెళ్తాం.

‘రామప్ప’కు రాజ్యసభ ప్రశంస..

రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కడం పట్ల రాజ్యసభ సంతోషం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు దీనికి సంబంధించిన సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ‘‘తెలంగాణలోని వరంగల్‌ సమీపంలో ఉన్న రామప్ప ఆలయంగా పేరొందిన చారిత్రక రుద్రేశ్వర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇప్పటికే ఇలాంటి హోదా పొందిన 38 చారిత్రక నిర్మాణాలు, 800 ప్రపంచ అద్భుత సౌధాల సరసన తాజాగా ఇది చేరింది. దాని సుసంపన్న హస్తకళా కౌశలం 40 ఏళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించిన కాకతీయుల కాలం నాటి శిల్పకళాకారుల నిరుపమానమైన అద్భుత ప్రతిభకు అద్దం పడుతుంది. ఇంతటి అపురూప కళాసౌధానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించడం మన దేశానికి గొప్ప గౌరవం. ఆనాటి శిల్పకళాకారుల అసాధారణమైన ఊహాశక్తి, సృజనాత్మకతకు లభించిన నివాళి. ఈ సందర్భంగా సభ తరఫున దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని వెంకయ్యనాయుడు పేర్కొనగా సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు.

ఇదీ చూడండి:VENKAIAH NAIDU: 'రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం దేశానికే గర్వకారణం'

ABOUT THE AUTHOR

...view details