తెలంగాణ

telangana

Leopard: నాలుగేళ్ల తర్వాత చిక్కిన చిరుత.. ఇక నిశ్చింతగా ఉండొచ్చా!

By

Published : Sep 15, 2021, 1:17 PM IST

నాలుగేళ్ల తర్వాత చిక్కిన చిరుత.. ఇక నిశ్చింతగా ఉండొచ్చా!
Leopard: నాలుగేళ్ల తర్వాత చిక్కిన చిరుత.. ఇక నిశ్చింతగా ఉండొచ్చా! ()

గ్రామీణ ప్రజలు, రైతులకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. నాలుగేళ్ల తర్వాత మరో చిరుత చిక్కడంతో అటవీ అధికారులు ఊపిరి పీల్చుకుంటుండగా ఇంకా మూడు చిరుతలు అడవిలోనే ఉండటంతో పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని చెబుతున్నారు రైతులు. నాలుగేళ్ల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు చిరుతలు బోనులో చిక్కడం విశేషం.

మెదక్‌ జిల్లా నార్సింగి మండలంలోని వల్లూరు ప్రాంతంలో దట్టమైన అడవి ఉండటంతో అక్కడ చిరుతలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. అడవి చుట్టూ వల్లూరు, నార్సింగి, కామారం తండా, శేరిపల్లి, మీర్జాపల్లి గ్రామాలు ఉన్నాయి. చిరుతలు ఎక్కువగా చిన్నశంకరంపేట మండలం కామారం తండా వైపు వస్తుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనతో గడుపుతూ వచ్చారు. పలుమార్లు దాడి చేసి పశువులు, మేకలను చంపితినగా వల్లూరు అటవీ ప్రాంతంలో గుట్టలపై కనిపించేవని అక్కడి వారు చెబుతున్నారు.

ఫలించిన ప్రయత్నం..

ఇక్కడి ప్రజలు నాలుగేళ్లుగా చిరుతతో సతమతమవుతున్నారు. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు బోను ఏర్పాటు చేయగా 2017 జూన్‌ 5న చిక్కగా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. తర్వాత కామారం అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేయగా అక్కడ చిక్కింది. ఇలా జిల్లాలో పలు చోట్ల చిరుతలు బోనులో చిక్కిన ఘటనలు ఉన్నాయి. 2015లో కొల్చారం మండలం తుక్కాపూర్‌ ఒకటి పట్టుబడగా 2021 జులైలో చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌ సమీపంలో చెరువులో చనిపోయి కనిపించింది. ముళ్లపందిపై దాడి చేయబోయి చనిపోయినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు.

మరో మూడు సంచారం

వల్లూరు, కామారం అటవీ ప్రాంతంలో మరో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. ఆదివారం బోనులో చిక్కిన చిరుత వయసు 18 నెలలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతే వయసున్న మరొక దానితోపాటు రెండు పెద్ద చిరుతలు ఇక్కడ తిరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వాటిని పట్టుకునేందుకు ఏడాది క్రితం వల్లూరు అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేయగా ఫలితం దక్కలేదు. నెల రోజుల క్రితం కామారం తండా ప్రాంతంలో ఏర్పాటు చేయగా అందులో చిక్కింది. ఆరు నెలల క్రితం నార్సింగిలోని గుండుచెరువు సమీపంలోని మేకల కొట్టంపై చిరుత దాడి చేసి వాటిని చంపి తీసుకెళ్లింది. సంబంధిత రైతు ఫిర్యాదుతో అటవీ అధికారులు అక్కడ బోను ఉంచినా ప్రయోజనం శూన్యం.

పొంచి ఉన్న ప్రమాదం

నార్సింగి మండలం వల్లూరు, చిన్నశంకరంపేట మండలం కామారం తండా ప్రాంతంలో తిరిగి బోను ఏర్పాటు చేస్తే మిగిలిన మూడు చిరుతలు చిక్కేందుకు అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆహారం లభించని సమయంలో అవి పశువులు, మేకలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టక పోయినా ప్రమాదం మాత్రం పొంచి ఉందని భావిస్తున్నారు.

ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే..

అడవి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే చిరుతలు బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పటికే చేగుంట మండలం వడియారం అర్బన్‌ పార్కు చుట్టూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఇనుప కంచె బిగించారు. మొత్తం 450 ఎకరాల చుట్టూ కంచెతో అటవీ ప్రాంతం నుంచి ఏ జంతువూ బయటకు రావడం లేదు. వల్లూరు అడవి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తే అక్కడ ఉంటున్న చిరుతలు బయటకొచ్చే అవకాశం ఉండదు. వాటికి ఆహారంగా ఇతర జంతువులను అడవిలో పెంచితే ఎలాంటి ప్రమాదం ఉండదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details