తెలంగాణ

telangana

పోడుభూముల జోలికి వెళ్లడం లేదు.. కోయపోచగూడ ఘటనపై అటవీశాఖ స్పందన

By

Published : Jul 10, 2022, 11:21 AM IST

పోడుభూములు

Forest Department: మంచిర్యాల జిల్లాలో కోయపోచగూడ ఘటనపై అటవీశాఖ స్పందించింది. ఇప్పటికే సాగుచేసుకుంటున్న పోడుభూముల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. కొత్తగా అడవిని నరికి ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని ఆ శాఖ తెలిపింది.

Forest Department: రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే సాగుచేసుకుంటున్న పోడుభూముల జోలికి వెళ్లడం లేదని, కొత్తగా అడవిని నరికి ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని అటవీశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దండేపల్లి మండలం కోయపోచగూడలో జరుగుతున్న ఘటనలకు అటవీశాఖ అధికారులను బాధ్యులుగా చిత్రీకరించడం తగదు. పులుల అభయారణ్యం, రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన భూములను స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే చట్టపరిధిలో అడ్డుకుంటున్నాం. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతంలో 25 ఎకరాల పరిధిలో చెట్లు నరికి, చదును చేస్తున్న వారిని వద్దని వారించినందుకు అధికారులపై స్థానికులు దాడి చేశారు’ అని పేర్కొంది.

గత ఏడాది నవంబరు నుంచి కోయపోచగూడలో అటవీ భూమి ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతుండటంతో అక్కడి స్థానికులకు రెవెన్యూ, పోలీస్‌, అటవీ అధికారులతో పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించామని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్రమణదారులను అడ్డుకుని చట్టపరిధిలో కేసులు పెట్టాల్సి వస్తోందని, కానీ కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానికులను రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

ఆక్రమిత భూముల్లో రెండ్రోజుల క్రితం గుడిసెలను రాత్రికిరాత్రి ఏర్పాటు చేశారని, వీటిని తొలగించేందుకు వెళ్లిన అధికారులకు అడ్డుగా చిన్నపిల్లలు, మహిళలను పెట్టి దాడులు చేశారని జన్నారం డివిజనల్‌ అటవీ అధికారి మాధవరావు పేర్కొన్నారు. సిబ్బంది కళ్లలో కారం చల్లడంతో పాటు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారని.. దీంతో సిబ్బంది గాయపడటంతో పాటు జీపు ధ్వంసమైందన్నారు. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోకి గ్రామస్థులు చొరబడి.. కొత్తగా పోడు కోసం అడవిని చదునుచేయడంతో సమస్య మొదలైందని మంచిర్యాల జిల్లా డీఎఫ్‌వో శివాని డోగ్రా తెలిపారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. నేడూ, రేపూ అతి భారీ వర్షాలు

ఎడతెరిపి లేని వాన.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం!

ABOUT THE AUTHOR

...view details