తెలంగాణ

telangana

Siblings met: తల్లిదండ్రుల మృతితో దూరమయ్యారు.. ఎఫ్​బీతో దగ్గరయ్యారు.!

By

Published : Jul 3, 2021, 8:00 PM IST

siblings met after 30 years

ఫేస్‌బుక్‌తో పరిచయాలు, ప్రేమలు, మోసాలే చూస్తుంటాం. కానీ ఆ సామాజిక మాధ్యమంతో ఆత్మీయులను కలిసిన వారు, దూరమైన స్నేహితులను కలిసిన వారి వార్తలు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటాయి. అలాంటిదే ఈ తోబుట్టువుల కథ. తల్లిదండ్రులను‌ కోల్పోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయ్యారు. మూడు దశాబ్దాల తరువాత ఫేస్​బుక్ బంధంతో అంతే వింతగా దగ్గరయ్యారు. 30 ఏళ్లుగా అనాథగా గడిపిన అన్న, అందరు ఉన్నా ఒంటరిగా పెరిగిన చెల్లి, తమ్ముడు, చెల్లిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనే ఆశతో బతికిన మరో అన్న ఇలా అందరూ ఒకే గూటికి చేరారు. వీరందరినీ కలిపింది ఫేస్​బుక్. అవును ఆ ఫేస్​బుక్ కలిపిన బంధమే ఈ కుటుంబం.

ముప్పై ఏళ్ల క్రితం విడిపోయిన తోబుట్టువులను ఫేస్​బుక్ కలిపి వారికి అనుబంధాల రుచిని పరిచయం చేసింది. ముగ్గురు అన్నదమ్ములు.. వారికో చెల్లి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం మంచిర్యాల జిల్లా నంనూర్​లో ఆటపాటల మధ్య హాయిగా గడిపారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ కుటుంబం అనాథగా మారింది‌. నలుగురు పిల్లలను బంధువులు తలా ఒకరు చొప్పున పంచుకున్నారు. కొన్ని అనివార్యాల కారణాల వల్ల వారు విడిపోయారు. ఇలా మూడు దశాబ్దాల తర్వాత ముచ్చటగా అంతా ఒక్కటయ్యారు. భార్యాపిల్లలకు ఇన్నాళ్లు తను అనాథనని చెప్పుకున్న భర్త.. అకస్మాతుగా తనకు ఓ కుటుంబం ఉందని చెప్పడంతో ఆ కుటుంబం ఆశ్చర్యానికి లోనవుతోంది. ఫేస్​బుక్ కలిపిన ఆ కుటుంబాన్ని పలకరిస్తే ఆనందంలో మునిగిపోయింది.

నంనూర్​లో తమ్ముడు, బంధువులతో గురువయ్య

ఇలా కలిశారు
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్​కు చెందిన ఆడెపు శంకరమ్మ, శంకరయ్యల సంతానం గురువయ్య, లక్ష్మణ్‌, సతీశ్‌, రమాదేవి. 1991లో అనారోగ్యంతో భార్యాభర్తలు శంకరయ్య, శంకరమ్మలు చనిపోయారు. ఒక్కసారిగా ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. గురువయ్యను లక్షెట్టిపేటలోని బాబాయ్ వరుస అయ్యే వ్యక్తి దత్తత తీసుకున్నాడు‌. చిన్నోడు సతీశ్​ను జన్నారానికి చెందిన మామ వరుస అయ్యే సాంబరి అంజన్న దత్తత తీసుకున్నాడు. మిగిలిన ఇద్దరు ఇంటి దగ్గరే ఉండిపోయారు. కానీ గురువయ్యను చేరదీసిన కుటుంబసభ్యులు అతడిని ఇబ్బందులకు గురి చేయడంతో ఇంట్లోంచి పారిపోయాడు. లక్షెట్టిపేట నుంచి పారిపోయిన గురువయ్య వరంగల్‌ చేరి.. కొన్నేళ్లపాటు హోటళ్లలో పనిచేశాడు. ఆ తరువాత హుస్నాబాద్​కు చేరుకుని వంటమాస్టర్​గా స్థిరపడ్డాడు. చిన్నోడు సతీశ్​ను దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నత చదువులు చదివించడంతో సాఫ్ట్​వేర్ ఉద్యోగం సంపాదించి హైదరాబాద్​లో సెటిల్ అయ్యాడు. సతీశ్​ ఫేస్​బుక్​లో తన ఇంటిపేరుతో సర్చ్​ చేస్తుండగా ఓ పేరు తన కుటుంబ సభ్యుడిలా అనిపించింది. తీరా ఆడెపు గురు ఖాతాలో ఫొటో చూశాక తన పెద్ద అన్నయ్య అని తేలింది. ఇంకేముంది సతీశ్​ ఆనందానికి అవధులు లేవు.

తమ్ముడి భార్యాపిల్లలు, చిన్నమ్మతో గురువయ్య

30 ఏళ్ల క్రితం విడిపోయాం. అప్పట్నుంచి వారి కోసం వెతకని చోటంటూ లేదు. ఎప్పటికైనా వారిని కలుస్తాననే ఆశ ఉండేది. నాకు ఫేస్​బుక్​లో ఖాతా ఉంది. ఒకరోజు సతీశ్​ అందులో మా ఇంటిపేరుతో వెతికినప్పుడు నా ఐడీ కనబడటంతో.. ఫొటోలో నా చిన్ననాటి పోలికలు గుర్తుపట్టి నన్ను సంప్రదించాడు. నా తోబుట్టువులను కలుసుకోవడం నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. అనాథలా బతికిన నాకు.. ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం దొరికింది. -గురువయ్య

పాత జ్ఞాపకాల్లో
కుటుంబం నుంచి విడిపోయే ముందు పెద్దవాడైన గురువయ్య వయసు 15 ఏళ్లు మాత్రమే. మిగతా ముగ్గురి వయసు 10 ఏళ్లలోపే. ఇప్పుడు వారందరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పిల్లాపాపలతో జీవనం గడుపుతున్నారు. ఇప్పుడిలా అంతా ఒక్కటయ్యారు. గురువయ్య తోబుట్టువులు.. ఫేస్​బుక్ కలిపిన బంధంతో మళ్లీ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మూడు దశాబ్దాల తర్వాత అంతా ఒకే చోటుకు చేరడంతో ఆడెపు గురువయ్య కుటుంబంలో అవధుల్లేని ఆనందం వెల్లివిరిసింది.

చిన్నప్పుడు తప్పిపోయిన గురువయ్య.. ఇప్పటివరకు ఎక్కడున్నారో తెలియలేదు. కానీ ఫేస్​బుక్​ ద్వారా మేమంతా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరిని నేనే చేరదీశాను. ఇప్పుడు మా కుటుంబంలో గురువయ్య, సతీశ్​ కలవడంతో మా ఆనందం రెట్టింపైంది. -లక్ష్మీ, గురువయ్య పిన్ని

చిన్న తమ్ముడు సతీశ్​ కుటుంబం

ఇన్నాళ్లు అనాథనని చెప్పుకున్న తన తండ్రి గురువయ్య, తనకూ ఓ కుటుంబం ఉందని బాబాయ్​, పిన్ని, బంధువులను పరిచయం చేయడంతో ఆనందంతో గురువయ్య కూతురు ఉప్పొంగిపోతోంది. ఇప్పుడు సతీశ్​, చెల్లి రమ్యను‌ కలిసేందుకు హైదరాబాద్​కు బయలు దేరుతున్నట్టు గురువయ్య తెలిపారు. టెక్నాలజీ మంచి చేస్తుంది. బంగారు భవిష్యత్తును ఇస్తుందంటే ఇదేనేమో అని గురువయ్య అన్నారు.

తల్లిదండ్రుల మృతితో దూరమయ్యారు.. ఎఫ్​బీతో దగ్గరయ్యారు

ఇదీ చదవండి:TRS ON REVANTH: రేవంత్​ డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నాడు: గండ్ర, సుధీర్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details