తెలంగాణ

telangana

paddy procurement issues: దళారుల అక్రమాలు ఆపేందుకే ఏపీ సరిహద్దుల్లో చెక్​పోస్టులు..!​

By

Published : Nov 27, 2021, 12:05 PM IST

Updated : Nov 27, 2021, 12:51 PM IST

paddy procurement issues, paddy procurement problems in mahabubnagar
ధాన్యం సేకరణకు షరతులు

గతేడాది ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొనుగోలు(paddy procurement ) కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు అమ్మి అక్రమర్కులు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో ఈసారి అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల(border checkposts)లో వాహనాలను తిప్పిపంపుతున్నారు. మరోవైపు ఆధార్‌తో మొబైల్ అనుసంధానం, ఓటీపీ, పంటల నమోదు, రైతుబంధు దస్త్రాల్లో నమోదై ఉండి వరి పండించిన రైతుల ధాన్యాన్నే ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ధాన్యం కొనాలంటే వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ తప్పనిసరి కావటంతో స్థానిక రైతులకు కాస్త ఇబ్బందిగా మారినా అక్రమాలకు మాత్రం చెక్ పడనుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ధాన్యం సేకరణకు షరతులు

Paddy procurement problems in mahabubnagar: గతేడాది వానాకాలం, యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచుకున్నా ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో ఎక్కువ మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి ధాన్యాన్ని అమ్ముకున్నారు. అలాంటి ధాన్యాన్ని వ్యాపారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ధాన్యానికి దక్కే ధర తక్కువ. తెలంగాణలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర రూ.1960 కొనుగోలు చేస్తారు. ఈసారి ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో....అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు, కేటీ దొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలం బల్గెరలో పోలీసు, రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన అధికారుల బృందం చెక్ పోస్ట్ ల వద్ద ధాన్యం రాకను పర్యవేక్షించనుంది. ధాన్యంతో వచ్చే లారీలను అక్కడినుంచే తిప్పి పంపుతున్నారు.

వేరే రాష్ట్రాల నుంచి వరి ధాన్యాన్ని ఇక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి.. అమ్ముతున్నారు. వేరే రాష్ట్రం నుంచి ధాన్యం వస్తున్నట్లుగా సమాచారం అందింది. అందుకే ప్రత్యేక బృందాలు పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ధాన్యాన్ని అమ్మడానికేనా? లేదా వేరే దగ్గరకు ధాన్యం తీసుకెళ్తున్నారా? అని ఆరా తీస్తారు. ధాన్యం లారీలను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటున్నారు. చిన్నచిన్న రహదారుల వద్ద కూడా తనిఖీలు జరపాలని ఆదేశించాం.

-రఘురామశర్మ, జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్

అక్రమాలకు అడ్డుకట్ట

గతేడాది వానాకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వనపర్తి జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తిరిగి అదే రైతుల ద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు మద్దతు ధరకు అమ్మారు. ఈ ఏడాది ఆ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధాన్యం అమ్మాలంటే రైతు ఆధార్ నంబర్- మొబైల్ నెంబర్‌ అనుసంధానంతో పాటు పంటల నమోదులో వివరాలు ఉండాలనే నిబంధన విధించారు.ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్న సాంకేతిక నిబంధనల కారణంగా ఆధార్‌తో మొబైల్‌ నంబర్ అనుసంధానం కాని రైతులు, పంటల నమోదులో పేర్లు నమోదు వాళ్లు, రైతుబంధు దస్త్రాల్లో వివరాలు లేని వాళ్లు అవి పూర్తయ్యే వరకూ ధాన్యం అమ్ముకోలేక పోతున్నారు.

మా ఊరికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చినప్పుడు నేను పంట నమోదు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఏవో దగ్గరకు పోయి నమోదు చేసుకున్న తర్వాతే ధాన్యం తీసుకురావాలని చెబుతున్నారు. ఒక్కరి పేరు మీద అమ్మడానికి అవడం లేదు. భూమి ఎంత ఉంటే అంత మాత్రమే కొంటామని చెబుతున్నారు. తక్కువ ధాన్యం ఉన్నవాళ్ల ఖాతాలో అమ్ముతున్నాం. రైతుకు ఎంత పండితే అంత తీసుకుంటే బాగుంటుంది. కానీ అలా తీసుకుంటలేరు. భూమి ఎంత ఉంటే అంతే తీసుకుంటామని చెబుతున్నారు.

-రైతులు, ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా

సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి ధాన్యం వచ్చినా అర్హులైన రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేసేందుకు పకడ్బందీ విధానాలు అమలు చేస్తున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని వ్యాపారులు తిరిగి ప్రభుత్వానికి అమ్మకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఎన్ని ఎకరాల్లో వరి పండించారో చూసి ఎకరాకు నిర్ణీత దిగుబడికి మాత్రమే అమ్ముకునేందుకు అధికారులు అనుమతినిస్తున్నారు. పంటల నమోదులో రైతు పేరు నమోదు కాకపోయినా, విస్తీర్ణంలో తప్పులు దొర్లినా, దిగుబడిలో తేడాలున్నా మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తే తప్ప కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తీసుకోరు. ఏ కొనుగోలు కేంద్రంలో ఆ పరిధి గ్రామాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు.

-పాండు, హన్వాడ కొనుగోలు కేంద్రం బాధ్యుడు

ఇదీ చదవండి:Flood Effect on Kadapa 2021 : వరద విధ్వంసం.. ఇసుక దిబ్బలుగా పంట పొలాలు

Last Updated :Nov 27, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details