తెలంగాణ

telangana

Tiger: పశువుల మందపై పెద్దపులి దాడి.. ఆహారమైన లేగదూడ

By

Published : Jul 11, 2021, 11:00 PM IST

tiger attack on Herd of cattle at sulugupally

పచ్చిక బయళ్లలో మేత మేస్తున్న పశువుల వాసన పసిగట్టిన పెద్దపులి.. పొదల చాటున మాటేసింది. తానున్న చోటుకు ఆ మూగజీవాలు వచ్చే వరకు ఓపికగా వేచి చూసింది. ఆకలి మీదున్న పెద్దపులి.. మాటేసిన స్థానానికి చేరువ కాగానే పశువుల మందపై దూకింది. ఆ పెద్దపులి విసిరిన పంజాకు ఓ లేగదూడ బలైంది. ఆ వ్యాఘ్రపు ఆకలికి ఆహారమైంది.

పశువుల మందపై పెద్దపులి దాడి.. ఆహారమైన లేగదూడ

కుమురం భీం జిల్లా బెజ్జురు మండలం సులుగుపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టించింది. పశువుల మందపై దాడి చేసి ఓ లేగదూడను హతమార్చింది. పులిని గమనించి పశువుల కాపరులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో పరుగులు తీశారు. సులుగుపల్లి గ్రామంలోని పెద్దసిద్దాపూర్ అటవీప్రాంతంలో పశువులను కాపరులు మేతకు తీసుకువెళ్లారు. మేత మేస్తోన్న పశువులను ఎప్పుటి నుంచి గమనిస్తోందో ఆ పెద్దపులి. సాయంత్రం కావస్తోంది. పొదల చాటున మాటేసింది. పులి విషయం పరిగట్టని పశువులు మాత్రం... గడ్డి మేస్తూ అది ఉన్న పొదల వైపే వెళ్లాయి. తనవైపే వస్తున్న పశువులను చూసి పులి పంజా విసరడానికి సిద్ధమైంది. పొదల దగ్గరకు వచ్చే వరుకు వేచి ఉన్న వ్యాఘ్రం... చేరువ కాగానే ఒక్క ఉదూటున పశువుల మందపై దూకింది. మందలోని ఓ లేగదూడపై పంజా విసిరింది. పెద్దపులి పంజా దెబ్బకు లేగదూడ కుప్పకూలింది. పులి దాడిని చూసి భయాందోళనకు గురైన కాపరులు గట్టిగా కేకలు వేశారు. పులిని తరిమి కొట్టేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించారు.

పెద్దపులిని తరుముతున్న కాపారి

స్థానికుల భయాందోళనలు...

హతమార్చిన లేగదూడను తింటున్న పులికి.. కాపారులు చేస్తున్న శబ్ధాలకు కోపం వచ్చింది. గాండ్రిస్తూ... దూసుకురావడంతో కాపరులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. . గ్రామానికి సమీపంలోనే పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. భయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. పశువులు పరిస్థితేంటని ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పెద్దపులి బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

లేగదూడను తింటున్న పెద్దపులి

గతంలోనూ ఆవుల మందపై దాడి...

గతంలోనూ పులి ఓ ఆవుల మందలపై దాడి చేసింది. గుండెపల్లి గ్రామ సమీపంలో ఆవులు మేత మేస్తున్నాయి. పొదల మాటున దాగున్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో ఓ ఆవు మృతి చెందింది. పులిని చూసి బెదిరిపోయిన మిగతా ఆవులన్నీ పారిపోయాయి.

అధికారుల హెచ్చరికలు...

కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందని ఆ ఏరియా ఎఫ్​డీఓ విజయ్ కుమార్ ఇప్పటికే స్థానికులకు తెలిపారు. అటవీ ప్రాంతం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలోని గూడెం, శివపెళ్లి, కోయపల్లి, నాగేపల్లి గ్రామాల ప్రజలు అడవిలోకి, సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. ఒకవేళ అత్యవసరమై వెళ్తే... గుంపులుగా వెళ్లి పనులు చేసుకోవాలని... సాయంత్రంలోపే ఇంటికి చేరుకోవాలని సూచించారు. అటవీశాఖ సిబ్బంది పులి కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఎఫ్​డీఓ విజయ్ కుమార్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details