తెలంగాణ

telangana

Apple cultivation: జైనూర్​లో జోరుగా ఆపిల్​ సాగు.. పంటపై రైతుల ఆసక్తి

By

Published : Jul 4, 2021, 7:24 PM IST

apple cultivation in jainoor
జైనూర్​లో ఆపిల్​ సాగు ()

ఆపిల్​.. ఈ పేరు వినగానే మొదటగా మనకు గుర్తొచ్చేది కశ్మీర్​, సిమ్లా.. అలాంటి చల్లటి ప్రదేశాల్లోనే ఆ పంట ఎక్కువగా సాగవుతుంది. అక్కడి నుంచే దేశవిదేశాలకు సరఫరా అవుతాయి. కానీ ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ పేరు కూడా చేరనుంది. ఎందుకంటే కుమురం భీం జిల్లాలో ఆపిల్​ సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అటవీ ప్రాంతం, శీతల ప్రదేశాలు కావడంతో ఆపిల్​ సాగుకు పుష్కల అవకాశాలున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన ఈ మొక్కలు.. ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నాయి.

ఆపిల్​ సాగులో మంచు ప్రదేశాలైన కశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​ ప్రఖ్యాతి చెందినట్లుగా ఇప్పుడు తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పేరుగాంచనుంది. రెండేళ్ల క్రితం జిల్లాలోని ఓ ప్రాంతంలో ఆపిల్​ సాగు చేసిన రైతు వల్ల ఇప్పుడు ఆ పంట పలు ప్రాంతాలకు వ్యాపించింది. జిల్లాలోని కెరమెరి మండలం ధనోరకు చెందిన రైతు కేంద్రే బాలాజీ ఆపిల్​ సాగు చేసి మొదటి పంటను సీఎం కేసీఆర్​కు కానుకగా ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఇలాంటి వినూత్న ప్రయత్నం చేపట్టడంతో గతేడాది బాలాజీ రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. అప్పుడు ధనోరలో సాగైన పంట.. జైనూర్​ మండలానికి వ్యాపించింది.

హరితహారంలో భాగంగా

జైనూర్​ మండల కేంద్రంలోని పాఠశాలలో రెండేళ్ల క్రితం హరితహారం కార్యక్రమంలో భాగంగా ధనోర నుంచి ఆపిల్​ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అంతేకాకుండా జైనూర్​ బాలికల ఆశ్రమ పాఠశాలలో నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి కాతకు వచ్చింది. దీంతో ఇక్కడ కూడా ఆపిల్​ పండించవచ్చని రుజువైంది. జైనూర్​, ధనోర అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం, శీతల వాతావరణం ఉండటంతో ఇక్కడ ఆ పంట సాగు చేయడానికి పుష్కల అవకాశాలున్నాయి.

విరగకాసిన ఆపిల్​ పండ్లు

'రెండేళ్ల క్రితం ఏటీడీవో భాస్కర్​ సార్​ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆపిల్​ మొక్కలు నాటారు. నేను సంరక్షణా బాధ్యతలు తీసుకున్నాను. నీళ్లు పోయడం, కలుపు తీయడం ఇలా అన్ని పనులు చేస్తున్నాను. మాకు కూడా ఈ పంటపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం పెట్టుబడి సాయమందిస్తే బాగుంటుంది. మొక్కలు అందించి ఆర్థిక సాయం అందించినట్లయితే మేము కూలీల్లా కాకుండా యజమానుల్లా మారే అవకాశం ఏర్పడుతుంది.'

-మొండె ఉత్తమ్​, బాలికల ఆశ్రమ పాఠశాలలో వాచ్​మన్​

రైతుల ఆసక్తి

చెట్టును చూపిస్తున్న ఉత్తమ్​

జైనూర్ మండల రైతులు ఆపిల్ సాగు చేయడానికి ఎంతో సుముఖత చూపిస్తున్నారు. జైనూర్ రైతులకు ప్రభుత్వం సహాయం అందించినట్లయితే ఆపిల్ పంటలు సాగు చేయడానికి ముందున్నామని వెల్లడించారు. జైనూర్ ప్రాంతమంతా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ వాతావరణం శీతలంగా ఉండటంతో ఆపిల్ పంటను సాగు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉన్నట్లు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హార్టికల్చరల్ అధికారులు అక్కడి వాతావరణాన్ని పరిశీలించి మొక్కలు అందించాలని కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి:BANDI SANJAY: ఆగస్టు 9న రాష్ట్రవ్యాప్తంగా భాజపా మహాపాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details