తెలంగాణ

telangana

జాతీయ నేతల చేతుల మీదుగా ఖమ్మంలో కంటివెలుగు ప్రారంభం

By

Published : Jan 18, 2023, 3:26 PM IST

Updated : Jan 18, 2023, 5:07 PM IST

Etv Bharat

దేశం దృష్టిని ఆకర్షించేలా నిర్వహిస్తున్న భారత్‌ రాష్ట్ర సమితి బహిరంగసభకు అతిథులు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రి పర్యటనకు వెళ్లిన నేతలు... అక్కడి నుంచి ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం అనంతరం, కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా భారత్‌ రాష్ట్ర సమితి అవతరించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న బహిరంగసభకు కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. దేశం దృష్టిని ఆకర్షించేలా జరుగుతున్న ఈ బహిరంగ సభకు పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో సహా పలువురు జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు.

యాదాద్రి ఆలయం దర్శించుకున్న తరువాత ఖమ్మం చేరుకున్న నేతలు అక్కడి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఛాంబర్‌లో కలెక్టర్‌ గౌతమ్‌ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన జిల్లా పాలనాసౌధాల నిర్మాణం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌.... నేతలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు.

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, సీఎస్ శాంతికుమారి, వైద్యాధికారులు కంటి పరీక్షల గురించి ముఖ్యమంత్రులకు వివరించారు. అనంతరం, పలువురు బాధితులకు ముఖ్యమంత్రులు విజయన్‌, కేజ్రీవాల్‌, మాన్‌, మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ అగ్రనేత రాజా కళ్లద్దాలు అందించారు.

ఖమ్మం జిల్లా పాలనాసౌధం, కంటి వెలుగు ప్రారంభోత్సవాల అనంతరం, కలెక్టరేట్‌లోనే అగ్రనేతలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అతిథుల కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. 17 రకాల మాంసాహార, 21 రకాల శాకాహార వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:

Last Updated :Jan 18, 2023, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details