తెలంగాణ

telangana

అప్పుడు స్టూడెంట్స్​​.. ఇప్పుడు లెక్చరర్స్​.. ఏకంగా..!

By

Published : Sep 6, 2022, 2:41 PM IST

అదే కాలేజ్​.. అప్పుడు స్టూడెంట్​.. ఇప్పుడు లెక్చరర్​.. ఏకంగా!

పాఠాలు నేర్చుకున్న చోటే అధ్యాపకులుగా పని చేయడం గొప్ప అనుభూతి. తాము ఆడిపాడి చదువుకున్న కళాశాలలో నాటి మధురస్మృతులను గుర్తుచేసుకుంటూ విద్యను బోధిస్తున్నారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 14 మంది చదువుకున్న చోటే అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చదువుకే పరిమితం కాకుండా ఎన్​ఎస్​ఎస్​, హరితహారం, కెరీర్​ గైడెన్స్​ వంటి అదనపు బాధ్యతలతో కరీంనగర్​ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో సేవలందిస్తున్నారు.

కరీంనగర్ ప్రభుత్వం డిగ్రీ, పీజీ కళాశాలలో కాకతాళీయంగా పూర్వవిద్యార్థులే అధ్యాపకులుగా 14 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. నాడు తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువుల స్ఫూర్తితో విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్పుతున్నారు. గతంలో అరకొర వసతులుండగా.. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని అధ్యాపకులు చెబుతున్నారు. 2008లో ఏడుగురు బదిలీపై రాగా.. ఆ తర్వాత మరో ఏడుగురు రావడంతో 14 మందికి చేరుకుంది. 1987-2002 మధ్య వారంతా వివిధ బ్యాచ్​లలో ఇక్కడ డిగ్రీలు చేశారు. చదువుకున్న చోటే విద్యాబుద్ధులు నేర్పడం.. గర్వకారణంగా ఉందని చెబుతున్నారు.

తాము చదువుకునే రోజుల్లో ఆడపిల్లల్లో కొంచెం బిడియం, భయంతో ప్రాంగణంలో తిరిగే వాళ్లమని, ప్రస్తుత యువత అందుకు భిన్నంగా చురుగ్గా ఉన్నారని కితాబిస్తున్నారు. ఉన్నత చదువుల్లో రాణించాలనే పట్టుదలతో పాటు ఏదైనా సాధించాలనే అభిలాష ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. పూర్వ విద్యార్థులే అధ్యాపకులుగా వచ్చిన వారంతా సబ్జెక్టులతో పాటు ఎన్​ఎస్​ఎస్​, మహిళా సాధికారత, టాస్క్, ఎకో క్లబ్, హెల్త్​ క్లబ్​, పరీక్షల విభాగం వంటి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉజ్వల జీవితాన్ని ఇచ్చిన కళాశాల రుణం తీర్చుకుంటున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చొరవతో పునరంకితమవుతున్నారు.

అధ్యాపకుల బృందం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు విలువలను నేర్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు తమకు పాఠాలు బోధించిన అధ్యాపకుల కుర్చీలో తామూ కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నామని అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..TAC Report on Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు టీఏసీ నివేదిక

బెంగళూరు టెకీలకు వరద కష్టాలు.. ట్రాక్టర్లు ఎక్కి ఆఫీసుకు..

ABOUT THE AUTHOR

...view details