తెలంగాణ

telangana

Awareness on Normal Deliveries : 'కడుపు 'కోత'లకు కత్తెర పడాల్సిందే..'

By

Published : May 9, 2022, 12:54 PM IST

Awareness on Normal Deliveries
Awareness on Normal Deliveries ()

Awareness on Normal Deliveries : ఏ పనిచేయాలన్నా ముహుర్తాలు చూస్తున్న రోజులివి. శస్త్ర చికిత్సలు, ప్రసవాలకు కూడా మూహుర్తాలు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రసవాల్లో సిజేరియన్లు పెరుగుతున్నాయంటూ ఏకంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు... పురోహితులు, వైద్యులతో ఇరువురితో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా సహకరించాలని కోరారు.

'కడుపు 'కోత'లకు కత్తెర పడాల్సిందే..'

Awareness on Normal Deliveries : రాష్ట్రంలో పెరిగిపోతున్న సిజేరియన్లపై సాక్షాత్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలివి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగినా... సాధారణ ప్రసవాలు పెద్ద సంఖ్యలో జరగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూహుర్తాలు పెట్టి మరీ సిజేరియన్లు చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇది మారాల్సిందేనని స్పష్టం చేశారు.

"ప్రపంచంలో ఎక్కడా 30 శాతం మించదు పెద్ద ఆపరేషన్లు. కానీ తెలంగాణలో మాత్రం కేవలం జగిత్యాల జిల్లాలోనే 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఇక నుంచి సాధారణ ప్రసవాలకే మహిళలు, వైద్యులు ప్రాముఖ్యత ఇవ్వాలి. మహిళలను ఆ దిశగా ప్రోత్సహించాలి. సాధారణ ప్రసవాలు పెరిగేలా గర్భిణిలకు అవగాహన కల్పించాలి. జగిత్యాలలో సుఖ ప్రసవాలు పెరిగితే.. ఆశా వర్కర్లకు, ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇస్తాం."

- హరీశ్ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

మంత్రి హరీశ్‌రావు సూచనలకు అనుగుణంగా...కరీంనగర్‌ సర్కారు దవాఖానాలో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రసవాల సంఖ్య పెరుగుతున్నా....అదేస్థాయిలో సిజేరియన్లు ఉన్నాయి. దీనిపై కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో పాటు అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వార్‌ దృష్టి సారించారు. పురోహితులు ముహుర్తాలు నిర్ణయించి ఒత్తిడి చేయటంతోనే సిజేరియన్లు చేస్తున్నామని వైద్యులు చెప్పటంతో... ఇరువురితో సంయుక్త సమావేశం నిర్వహించారు. వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తొలి కాన్పు సిజేరియన్‌ జరిగితే విధిగా రెండోసారి ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు చేయాల్సిన వ్యాయామాలతో పాటు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు.

"ఒకసారి సిజేరియన్ చేస్తే.. రెండో కాన్పులోనూ అదే పంథా సాగించాల్సి వస్తుంది. దీనివల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. 50 ఏళ్ల క్రితం సిజేరియన్లు లేవు. కానీ ఈ మధ్య కాలంలో అదొక సేఫ్ ప్రాసెస్ అయింది. మొదటి కాన్పులో కాస్త కష్టపడితే.. రెండో కాన్పుకు చాలా సులభమవుతుంది. సాధారణ ప్రసవం జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు."

- ప్రసూతి వైద్యురాళ్లు

ప్రభుత్వ, ప్రైవేటు ప్రసూతి వైద్యనిపుణులు, పురోహితులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ముహూర్తాల ద్వారా శస్త్రచికిత్సలు, ప్రసవాలు జరగకుండా గర్భిణులకు అవగాహన కల్పిస్తామని పురోహితులు కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. సిజేరియన్ వల్ల కలిగే అనర్థాలు... సాధారణ ప్రసవాలతో కలిగే లాభాల గురించి వైద్యారోగ్య శాఖ రూపొందించిన పోస్టర్లను విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.

"సిజేరియన్ ఆపరేషన్‌ల వల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి. కరీంనగర్ జిల్లాలో సిజేరియన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందుకే మహిళలకు సుఖ ప్రసవాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. కొందరు పురోహితులను కలిసి ప్రసవానికి ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఆ మహూర్తంలోనే సిజేరియన్ చేయాలని వైద్యులను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. ఏ సమయంలో.. ఎవరు.. ఎలా పుట్టినా.. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి."

- గరిమా అగర్వాల్, కరీంనగర్ అదనపు కలెక్టర్

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలతో పాటు సిజేరియన్లు పెరుగుతున్ననేపథ్యంలోఅడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలు పకడ్బందీగా అమలు చేస్తే అనుకున్నలక్ష్యం నెరవేరే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details