తెలంగాణ

telangana

Huzurabad By Election: ఇంత తక్కువిస్తున్నారేంది.. మా ఓట్లు అంత చీపా..?

By

Published : Oct 29, 2021, 4:08 PM IST

Updated : Oct 29, 2021, 7:42 PM IST

bjp leaders money distribution in Huzurabad by elections
bjp leaders money distribution in Huzurabad by elections

హుజూరాబాద్​ ఎన్నికల్లో ధనప్రవాహం హోరెత్తుతోంది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. గెలవటమే ముఖ్యమని విచ్చవిడిగా ఆయా పార్టీలు.. నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఏ పార్టీ అని చూడకుండా అందినకాడికి తీసుకుందామని ఓటర్లు కూడా ఫిక్స్​ అయినట్టున్నారు. డబ్బు ఇవ్వకపోయినా.. కొందరికి ఎక్కువిచ్చి వాళ్లకు తక్కువిచ్చినా.. రోడ్లెక్కేస్తున్నారు. గుట్టుగా నడిపిస్తున్న తతంగాన్ని బజార్లో పెట్టేసి.. బహిరంగం చేసేస్తున్నారు.

ఇంత తక్కువిస్తున్నారేంది.. మా ఓట్లు అంత చీపా..?

హుజురాబాద్ ఉపఎన్నిక​లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రక్రియ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి. జనాలను డబ్బు, మద్యంతో తమవైపు తిప్పుకొని ఓట్లు వేపించుకోవాలని నాయకులు వేసిన ప్లాన్​.. సక్రమంగా అమలు కాకపోగా.. తిరగబడింది. ఈ తతంగం కోసం బరిలో దిగిన చోటామోటా నాయకులు.. ఓటర్లతో తిట్లు తినటమే కాకుండా.. నలుగురిలో నవ్వులపాలు అవుతున్నారు.

సీల్డ్​ కవర్లతో మొదలైన రచ్చ..

బుధవారం రోజున సీల్డ్​ కవర్లు పంచటం చర్చనీయాంశం కాగా.. అందులో 6 నుంచి 10 వేల నగదు ఉండటంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వార్త.. ఆ నోటా ఈ నోటా నానుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో పాటు డబ్బు అందని ఓటర్ల చెవిన పడటంతో.. వాళ్లంతా తీవ్ర ఆందోళన చేశారు. స్థానిక నాయకులను నిలదీశారు. ఈ పరిణామంతో స్థానిక నాయకులకు, పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైంది.

మళ్లీ తిరగబెట్టిన పంపిణీ..

ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నా పట్టించుకోకుండా.. ఈరోజు కూడా హుజూరాబాద్​ పట్టణంలోని ఐదో వార్డులో ఓ పార్టీకి చెందిన గల్లీ లీడర్లు.. ఓటర్లకు డబ్బు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చేతుల్లో లిస్టులు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ.. ఓటుకింతా అంటూ పంపకాలు చేపట్టారు. కొందరికి ఓటుకు 1500 చొప్పున ఇవ్వగా.. మరికొందరికి కేవలం 500 మాత్రమే ఇచ్చారు. అంతా బాగానే ఉందని చేతులు దులుపుకుని వెళ్లి పోదామనుకునేలోపు.. పలువురు ఓటర్లు వాళ్లను నిదీశారు. కొందరికి 1500 ఇచ్చి.. తమకు మాత్రం రూ. 500 ఎందుకు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తే.. అందరికీ ఒకేలా ఇవ్వాలి కానీ.. ఇలా బేషజాలు చూపెడుతూ... ఇవ్వటమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకొందరైతే.. తమకు అసలు ఒక్క రూపాయి కూడా అందలేదని అక్కస్సు వెల్లగక్కారు.

వీడియోలు వైరల్​..

ఓట్ల కోసం డబ్బు ఇవ్వడం లేదని కొందరు నిరసన చేపట్టారు. డబ్బులు పంచుతున్న నాయకులను పట్టుకుని రోడ్డు మీదే నిలదీశారు. హుజురాబాద్‌లోని ఓ కౌన్సిలర్ ఇంటిని.. వార్డు సభ్యులు ముట్టడించారు. ఒక ఓటుకు 6 వేల చొప్పున కొంతమందికి మాత్రమే ఇచ్చారంటూ ఆగ్రహించారు. కౌన్సిలర్‌ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వార్డు ప్రజలకు నచ్చ చెప్పినా వినలేదని.. 70 లక్షలు ఇంట్లో పెట్టుకొని ఇవ్వడం లేదంటూ దాడి చేశారని.. బాధితులు వాపోయారు. తనతో పాటు కుమారుని పై దాడి చేసినట్లు... కౌన్సిలర్‌ భార్య ఆరోపించారు.

ఓట్ల కోసం డబ్బులు పంచుతుంటే.. వాళ్లను పట్టుకుని బుద్ధి చెప్పాల్సింది పోయి.. "వాళ్లకు ఎక్కువిచ్చారు.. మాకు తక్కువిచ్చారు..? అందరికీ ఇస్తున్నారు.. మాకు ఇవ్వట్లేదు..? మా ఇంట్లో ఇన్ని ఓట్లున్నా.. ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.." అంటూ ఓటర్లు రోడ్లెక్కటమే.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఇవీ చూడండి:

Last Updated :Oct 29, 2021, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details