తెలంగాణ

telangana

బడిని బాగు చేసి.. ప్రత్యేకత చాటండి..!

By

Published : Jun 6, 2021, 4:46 PM IST

Repair the government school and make it special ..!

పాఠశాలను అభివృద్ధి చేసి, పది మందికి విద్యాబుద్ధులు చెప్పి మార్గదర్శకంగా నిలవాలనుకున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం వేదిక ఏర్పాటు చేసింది. ఆసక్తిగల బోధకులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి, అవగాహన చేసుకున్న అంశాలతో భౌతికరూపం కల్పించిన పాఠశాలకు బహుళ ప్రచారం కల్పించనుంది. గతేడాది నుంచి సమాజ భాగస్వామ్యంతో ఉన్నతికి శ్రమించిన ఉపాధ్యాయులను, బడిని గుర్తించి చేసిన కృషిని పుస్తక రూపంలో ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పంపించి ప్రచారం చేసేందుకు సంకల్పించింది. వ్యక్తిగతంగా, వ్యవస్థపరంగా ఎదుగుదలకు దోహదపరిచే పలు విషయాలపై విద్యాశాఖ ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తోంది. ఇందులో చేరి విజ్ఞానం సంపాదించి అమల్లోకి తెస్తే రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొందే అరుదైన అవకాశం అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది.

గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు తమ ఆవాస ప్రజల భాగస్వామ్యం తీసుకొని ఆదర్శంగా నిలిచిన అరవై పాఠశాలల విజయగాథలను ప్రచురించింది. వివిధ ప్రమాణాలను సంతృప్తిపరిచిన పాఠశాలల వివరాలను ‘‘ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఇన్‌టు వైబ్రెంట్‌ లెర్నింగ్‌ హబ్‌’’ పేరిట 278 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. విజయాలను సమర్థించే చిత్రాలను, వివరాలు అందించిన ప్రధానోపాధ్యాయుల వివరాలు కూడా పొందుపరిచారు. ఈ పుస్తకంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నాలుగు పాఠశాలల వివరాలు చోటు చేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ‘వైజ్ఞానిక విజయం’ పేరిట, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కడిపికొండ ప్రాథమిక పాఠశాల Hard work is a key to success, వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ సంగం ఉన్నత పాఠశాల we love our school ఉప్పరపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం’’ శీర్షికన రాసిన కథనాలు అందులో చోటు చేసుకున్నాయి.

నగదు బహుమతులు

కడిపికొండలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. వేలాది రూపాయల ఫీజు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలకు పంపే నిరుపేద తల్లిదండ్రులను కలిసి, వారిలో అవగాహన పెంచి.. 104 మంది ప్రభుత్వ బడికి వచ్చేలా చేశారు.

అధ్యయన శాల ఏర్పాటు

సంగెం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల విద్యార్థులకు భాషా అధ్యయనశాలలు ఏర్పాటు చేశారు. ఊరి ప్రజలను చైతన్యవంతులను చేసి రసాయన విగ్రహాలస్థానే విద్యార్థులు మట్టి విగ్రహాలు తయారు చేసి వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించుకునేలా చేస్తున్నారు.

మెరుగైన ఫలితాలు

ఉప్పరపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామంలోని యువజనులందరినీ సంఘటితం చేశారు. ‘యునైటెడ్‌ యూత్స్‌ ఆఫ్‌ ఉప్పరపల్లి’ పేరిట వసతులు సమాజం కల్పిస్తే ఫలితాలు మేము సాధిస్తామనే నినాదంతో ఊరిని ఆకర్షించి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.

చేతి రాత పోటీల్లో ప్రతిభ

పాలకుర్తి మండలం చెన్నూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉన్నతికి సమాజాన్ని ఆహ్వానించి వారి సహకారంతో పలు ఉప సంఘాలను ఏర్పాటు చేశారు. సహ పాఠ్యాంశ ప్రణాళిక అమలులో భాగంగా ఈ పాఠశాల విద్యార్థులు చేతి రాత పోటీల్లో జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. ఆంగ్లం, గణితం అధ్యయన శాలలు ప్రారంభించారు.

ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణ పొందాలి

ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్‌ శిక్షణ పొందాలని సమాచారమిస్తున్నాం. విద్యాశాఖ ఈ మధ్య ప్రచురించిన పుస్తకంలో చెన్పూరు సహా మొత్తం నాలుగు పాఠశాలల విజయగాథలు చోటు చేసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ప్రతి ఉపాధ్యాయుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నాం. మరిన్ని వివరాలకు అంతర్జాల చిరునామా http:///pslm.niepa.ac.in లో శోధించవచ్చు.

- సిగసారపు యాదయ్య, విద్యాశాఖాధికారి, జనగామ జిల్లా

ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'

ABOUT THE AUTHOR

...view details