తెలంగాణ

telangana

రేపటి నుంచే టీచర్ల బదిలీలు.. జీవో జారీ చేసిన సర్కారు

By

Published : Jan 26, 2023, 8:41 AM IST

Updated : Jan 26, 2023, 4:55 PM IST

telangana teachers transfer

06:30 January 26

ఉపాధ్యాయుల బదిలీలకు జీవో జారీ.. రేపటి నుంచే ప్రక్రియ షురూ

Teachers Transfers in Telangana: రాష్ట్రంలో రేపటి నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేడు జీవో 5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. రేపు కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్​ఈవోలకు.. మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాలి.

Teachers Transfers Schedule finalized: ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎమ్​ఈవోలు.. డీఈవో కార్యాలయంలో సమర్పణ, పరిశీలన, ఆన్‌లైన్‌లో ఆమోదం జరుగుతాయి. ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్‌సైట్లలో బదిలీలు, పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు సీనియారిటీ జాబితాపై మూడు రోజులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 13న మల్టీ జోనల్ స్థాయిలో, ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునఃపరిశీలన చేపడతారు. ఫిబ్రవరి 14న ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 15న హెచ్​ఎమ్​ల బదిలీల అనంతరం మిగిలిన ఖాళీలను ప్రకటిస్తారు.

ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు.. ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల హెచ్​ఎమ్​ల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల ప్రకటన, బదిలీ ఆప్షన్స్ నమోదు ఉంటుంది. ఫిబ్రవరి 21న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం కల్పించి ఫిబ్రవరి 22, 23 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీకి డీఈవోలు ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 25 నుంచి 27 తేదీల్లో ఎస్​జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు.. మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఎస్​జీటీ తత్సమాన పోస్టుల ఖాళీలు ప్రకటించి వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారు.

బదిలీలన్నీ వెబ్‌ కౌన్సెలింగ్ విధానంలోనే ఉంటాయని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయిదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోక పోయినా బదిలీ చేయనున్నట్లు జీవోలో వెల్లడించారు. మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లను వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బాలికల పాఠశాలల్లో 50ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేసి.. మహిళను నియమిస్తారు. ఒకవేళ మహిళ ఉపాధ్యాయులు లేకపోతే.. 50ఏళ్లు దాటిన పురుషులను నియమిస్తారు.

మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం కల్పించి.. మార్చి 4న ఎస్​జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. మార్చి 5 నుంచి 19 వరకు డీఈవో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలి. పూర్తి మార్గదర్శకాలు ఒకటి, రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.

ఇవీ చూడండి..

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల.. షెడ్యూలు ఖరారు.!

జీవో నంబర్ 317 సవరణకు ఉపాధ్యాయుల డిమాండ్.. ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తం

Last Updated :Jan 26, 2023, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details