తెలంగాణ

telangana

తీరికలేని వైద్య సిబ్బంది... చిన్నారులకు అందని వ్యాక్సిన్‌లు

By

Published : Aug 11, 2020, 6:28 AM IST

corona effect on Children vaccine in hyderabad
తీరికలేని వైద్య సిబ్బంది... చిన్నారులకు అందని వ్యాక్సిన్‌లు

కొవిడ్‌ విధుల్లో వైద్య ఆరోగ్య సిబ్బందికి తీరికలేకుండా పోయింది. దీనితో చిన్నారులకు సమయానికి వ్యాక్సిన్‌లు అందడం లేదు. మరోవైపు కరోనా భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో నగరంలో చిన్నారులకు సమయానికి ఇతర వ్యాధి నిరోధక టీకాలు అందడం లేదు. కరోనా విధులతో చాలామంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. అంతేకాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా కోసం ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇవి జరుగుతుండటంతో వైద్య సిబ్బంది ఇతర కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వస్తోంది. దీంతో ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకువెళ్లినా.. వారికి వైద్య సిబ్బంది టీకాలు వేసే పరిస్థితి ఉండటం లేదు. మరికొన్ని చోట్ల వాటిని వేయించడానికి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు కరోనా భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. మరోపక్క నగరంలో కరోనా కేసుల వ్యాప్తి వల్ల అనేకమంది వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు.

పిల్లలకు తప్పనిసరి..

లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వం స్పందించి టీకాలపై స్పష్టతనిచ్చింది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అయిదేళ్లలోపు చిన్నారులందరికీ వెంటనే టీకాలు అందించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు శివార్లలోని ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రతి బుధ, శనివారం అన్ని యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీకాలు వేయాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమం కొన్ని రోజులు సక్రమంగా సాగినా.. కరోనా కేసులు పెరగడంతో మళ్లీ టీకాలు అందడం లేదు. కొన్నిచోట్ల తల్లిదండ్రులు ఫోన్లు చేసి వైద్యుల సమయం తీసుకొని పిల్లలకు టీకాలు ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల టీకాల కోసం అన్నిచోట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కరోనాపై మోదీ పోరుకు గ్రామీణ భారతం ఫిదా!

ABOUT THE AUTHOR

...view details