BRS Leader Niranjan Reddy on Rythubandhu : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో రంజిత్ రెడ్డిని మళ్లీ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా నేడు చేవెళ్ల నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
దిల్లీలో తెలంగాణ నేతలు అంటే బీఆర్‌ఎస్ నేతలే గుర్తుకువస్తారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నిక్లలో(Lok Sabha) బీఆర్‌ఎస్సే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లు మాత్రమే తేడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ ఓడిపోయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు. లోటు పాట్లను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు.
ఎన్నికలప్పుడు రైతుబంధు(Rythu Bandhu)ను ఆపింది కాంగ్రెస్ కాదా అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు అందరికీ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చెప్పి మరీ రైతుబంధు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. రైతుల వివరాలు మొత్తం వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయని, ఆ వివరాలు ఉన్నా రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.