Arrests in TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో బుధవారం నగర సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేయగా... ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన ఏఈ రమేశ్ కుమార్ వద్ద సుమారు 40 మంది పశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. వీరిలో ఇప్పటివరకు దళారులు, కొనుగోలు చేసిన 19 మందిని అరెస్టుచేశారు. ఈ ముఠాతో సంబంధాలున్న ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరో ఆరుగురిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరివద్ద పూర్తి వివరాలు సేకరించాక అరెస్టు చేసే అవకాశముంది. టీఎస్‌పీఎస్సీ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 80కి చేరింది.
SIT Inquiry in TSPSC Paper Leak :టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నగర సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్ అతని కుమార్తె సాహితీలను సిట్ అరెస్టు చేసింది. మద్దెల శ్రీనివాస్, తన కూతురు సాహితి ఏఈ పరీక్ష రాసేందుకు రమేశ్ కుమార్ సహాయం కోరాడు. రూ.30లక్షల ఒప్పందంతోహైటెక్ మాస్ కాపీయింగ్‌ద్వారా విజయవంతంగా పరీక్ష రాయించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో తండ్రి, కుమార్తెలను బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
తల్లిదండ్రుల మెడకు పేపర్ లీకేజీ ఉచ్చు : మరోవైపు ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కొందరు నిందితుల తల్లిదండ్రుల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం డబ్బు చెల్లించిన అనేక మంది, ఆ డబ్బు తమ తల్లిదండ్రుల నుంచే తెచ్చుకున్నారు. అంటే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు గురించి చాలామంది తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉంటుంది. నేరం గురించి తెలిసీ చెప్పకపోవడం తప్పు కాబట్టి వారిని కూడా ఈ కేసులో జోడించే అవకాశం ఉంది. అయితే వీరిని సాక్షులుగానే పరిగణించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు న్యాయపరమైన కసరత్తు చేస్తున్నారు.