తెలంగాణ

telangana

అంతర్రాష్ట రహదారికి అవరోధం.. ప్రతిపాదనలకే పరిమితం

By

Published : Aug 29, 2021, 4:16 PM IST

adilabad road proposals
adilabad road proposals ()

ప్రజాప్రతినిధుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపంగా మారుతోంది. రోడ్ల పనులకు పరిపాలన అనుమతులు లభించినా .. అవన్నీ ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడవడం సహా.. ప్రజలూ అవస్థలు పడుతున్నారు.

రహదారులు ప్రగతికి చిహ్నాలు.. అనే మాట ఆదిలాబాద్‌ జిల్లాలో ఆచరణలోకి రావడంలేదు. ప్రజాప్రతినిధుల అలసత్వం .. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రవాణా సౌకర్యాల కల్పనలో ప్రగతి కనిపించడంలేదు. ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ప్రామాణికం కలిగిన కరంజీ(టీ) అంతర్రాష్ట (ఆర్​ అండ్​ బీ పరిధిలోనిది) రహదారిపై బీటీ వేయడం కోసం రూ.6 కోట్లు, ఇదే మార్గంలో ఐదు చోట్ల వంతెనల నిర్మాణం కోసం రూ.7.75 కోట్ల పనులకు ఏడాది కిందటే పరిపాలన అనుమతులు లభించాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ టెండర్‌ ప్రక్రియ జరగలేదు. ఫలితంగా జిల్లా, మండల కేంద్రాలను రెండు వరుసల రహదారితో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు.

కలెక్టర్​ ఆమోదముద్ర వేసినా..

భీంపూర్‌ మండలం పరిధిలోకి వచ్చే వడూర్‌ సమీపంలోని లోలెవల్‌ వంతెన ఉన్న చోటనే కొత్తది నిర్మించాలని ఆర్​ అండ్​ బీ అధికారులు గతంలో ప్రతిపాదనలు తయారుచేశారు. కానీ ఈ ప్రాంతం దగ్గర రహదారి వెడల్పు చేసే అవకాశం లేనందున ప్రస్తుతానికి ఈ వంతెనను అలాగే ఉంచి.. దాని స్థానంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే సంటర్‌సాంగ్వి వద్ద వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ ఆమోదముద్ర వేసిన ప్రతిపాదనల్లో మాత్రం వడూర్‌ సమీపంలోని వంతెనే ఉంది. ఇది సమన్వయలోపాన్ని స్పష్టం చేస్తోంది. ఫలితంగా.. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అనే విధంగా తయారవుతోంది.

ప్రతిపాదనలే సిద్ధం కాలేదు..

నాలుగు వరుసల జాతీయ రహదారి కలిగిన జందాపూర్‌ ఎక్స్‌రోడ్డు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 46 కిమీల మేర ఆర్‌అండ్‌బీ రహదారి వెళ్తోంది. ఉమ్మడి జిల్లాలోనే కీలకమైన ఈ దారి అధ్వానంగా మారింది. ఇప్పటిదాకా కొత్త రోడ్డు వేయకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జందాపూర్‌ క్రాస్‌రోడ్డు నుంచి 19 కిమీ దూరంలో ఉన్న ధనోర వరకు ప్రస్తుతమున్న 3.7 మీటర్లతో ఉన్న దారిని 7 మీటర్లకు పెంచుతూ.. డబుల్‌ రోడ్డు పనుల కోసం రూ.6 కోట్లకు ఆమోద ముద్ర లభించింది. మిగిలిన 27 కిమీ రోడ్డు వెడల్పుకోసం ప్రతిపాదనలకు తయారు చేయలేదు.

ప్రజాప్రతినిధుల వ్యవహారం.. అధికారులకు లాభం

కరంజి(టి) రహదారిపై నిపానితో పాటు మండల కేంద్రమైన భీంపూర్‌ కంటే ముందు, భీంపూర్‌ తరువాత, వడూర్‌, కరంజి(టి)-టేకిడి రాంపూర్‌ మధ్యలో అయిదు చోట్ల వంతెనల నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. పనుల కోసం జిల్లా ఖనిజ నిధి(డీఎంఎఫ్‌) నుంచి రూ.7.75 కోట్లను కేటాయిస్తూ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ గతేడాది అక్టోబర్‌ 19న ఆమోద ముద్రవేశారు. తరువాత 19 కిమీ మేర రహదారి వెడల్పు కోసం మరో రూ.6 కోట్లకు ఆమోద ముద్ర లభించింది. ఆర్‌అండ్‌బీ యంత్రాంగం రూ.10 లక్షలతో హైదరాబాద్‌కు చెందిన సాయిల్‌ టెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కన్సల్టెన్సీతో సర్వే సైతం చేయించింది. ఇష్టారీతిన నివేదికలు తయారు చేస్తుండటంతో ఏడాదిగా ప్రతిపాదనల దశ దాటడం లేదు. రహదారి వెడల్పయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహోర్‌కు వెళ్లడంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మార్గం సులువవుతుంది. ఇందుకే ఈ రోడ్డును తొలుత జాతీయ రహదారిగా మార్చడానికి కేంద్రం మొగ్గు చూపింది. ఇందుకోసం పంచాయతీరాజ్‌ పరిధి నుంచి ఆర్‌అండ్‌బీకి మార్చింది. ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వచ్చిన తరువాత జాతీయ రహదారి ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయింది. అధ్వానంగా ఉన్న దారితోపాటు వంతెనల నిర్మాణాలు ప్రతిపాదనల దశ దాటడం లేదు. జిల్లా ప్రజాప్రతినిధులు అంటీ ముట్టనట్లు వ్యవహరించడం అధికారులకు అన్ని విధాలుగా కలిసివస్తోంది.

ఇదీ రహదారి ప్రాముఖ్యత

  • ఆదిలాబాద్‌ డిపో పరిధిలో ఆర్టీసీకి అత్యధిక లాభం తెచ్చే మార్గం
  • మహరాష్ట్రతో పాటు 3 మండలాలు, 30 పంచాయతీల అనుసంధానం
  • ఆదిలాబాద్, బోథ్‌ నియోజవర్గాల పరిధిలో పొడవైన రహదారి
  • ప్రతిపాదనల్లో ఆగిపోయినా.. జాతీయ రహదారిగా మారే అవకాశం
  • ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మహోర్, ఉన్కేశ్వర్‌ మధ్య రాకపోకలకు అనుకూలం

ఇదీచూడండి:Ministers Visit: మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం​.. నేతల జేబులకు కన్నం!

ABOUT THE AUTHOR

...view details