తెలంగాణ

telangana

Adilabad collector: బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వాగు దాటి వెళ్లిన కలెక్టర్

By

Published : Aug 25, 2021, 12:22 PM IST

Adilabad collector
Adilabad collector ()

సరైన సమయానికి వైద్యం అందక మృతి చెందిన గర్భిణి కుటుంబ సభ్యులను ఆదిలాబాద్​ కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పరామర్శించారు. కాలినడకన వాగును దాటి గ్రామానికి చేరుకున్నారు. గర్భిణి రాజుబాయి మృతికి ఎదురైన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వాగు దాటుతూ వెళ్లిన కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో ఓ బాధిత కుటుంబాన్ని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పరామర్శించారు. రెండు రోజుల క్రితం పర్సువాడకు చెందిన గర్భిణీ సరైన సమయానికి వైద్యం అందక మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఐటీడీఏ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూనికాసా గోండ్‌గూడ నుంచి కోలాంగూడ వాగును కాలినడకన దాటి గ్రామానికి చేరుకున్నారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గర్భిణి రాజుబాయి మృతికి ఎదురైన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాదిగూడ పీహెచ్‌సీలో సిబ్బంది ఉండి ఉంటే బతికేదని కుటుంబీకులు, గ్రామస్థులు పాలనాధికారి వద్ద వాపోయారు. ఈ విషయమై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుని నివేదికను సమర్పించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాఠోడ్‌ను కలెక్టర్ ఆదేశించారు.

సరైన సమయంలో వైద్యం అందకపోవడం బాధాకరమని అన్నారు. సకాలంలో వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి 25 వేల రూపాయల చెక్కును అందించారు. కొలాం భాషలో కళాకారులచే ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. గాదిగూడ పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఏజెన్సీలోని మారుమాలు గ్రామాల్లో వంతెనలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ అధికారులు హామీ ఇచ్చారు. గాదిగూడ మండలంలోని గ్రామానికి రోడ్డు మంజూరైనా.. అటవీ అధికారుల అనుమతి లేక పనులు నిలిచిపోయాయని తెలిపారు. త్వరలోనే పనులు జరిగేలా చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత కథనం:సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి

ABOUT THE AUTHOR

...view details