తెలంగాణ

telangana

Movie review: 'తమసోమా జ్యోతిర్గమయ'- మరో 'మల్లేశం'గా నిలిచిందా?

By

Published : Oct 29, 2021, 1:07 PM IST

thamasoma jyothirgamaya movie review
తమసోమా జ్యోతిర్గమయ

చేనేత కళాకారుల ప్రాధాన్యతను ఆవిష్కరిస్తూ 'మల్లేశం' దోస్త్ కథ అంటూ తెరకెక్కిన చిత్రం 'తమసోమా జ్యోతిర్గమయ'. కేవలం 11 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎంతో మంది మేధావులు, విమర్శకుల ప్రశంసలందుకుంది. మరి ఆ చిత్రం ఎలా ఉంది? సామాన్య ప్రేక్షకులను మెప్పించిందా?

చిత్రం: తమసోమా జ్యోతిర్గమయ

నటీనటులు: ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి, జనార్దన్, రచ్చ రామకృష్ణ తదితరులు

కథ-మాటలు-దర్శకత్వం: విజయ్ కుమార్ బడుగు

డీవోపీ, ఎడిటింగ్: శ్రావణ్ జి.కుమార్

సంగీతం: ప్రశాంత్ బి.జె.

సాహిత్యం: పెద్దింటి అశోక్, సాయిచరణ్, ప్రశాంత్ బి.జె, రంజని శివకుమార్

కళ: సాయిని భరత్

నిర్మాణ సంస్థ: విమల్ క్రియేషన్స్, గుణాస్ ఎంటర్ టైన్ మెంట్స్

విడుదల తేది: 29-10-2021

ఆసు యంత్రాన్ని సృష్టించి చేనేత రంగంలో నేతన్నల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేశాడు చింతకింది మల్లేశం. ఆ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించడమే కాకుండా తన జీవితం మల్లేశం రూపంలో వెండితెరపై సందడి చేసింది. చేనేత కుటుంబాల్లోని కష్టాలకు అద్దంపట్టింది. ఇప్పుడు అదే కోవలో చేనేత కళాకారుల ప్రాధాన్యతను ఆవిష్కరిస్తూ మల్లేశం దోస్త్ కథ అంటూ భూదాన్ పోచంపల్లికి చెందిన యువకుడు బడుగు విజయ్ కుమార్ 'తమసోమా జ్యోతిర్గమయ' చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం 11 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎంతో మంది మేధావులు, విమర్శకుల ప్రశంసలందుకుంది. మధ్యలో కరోనా విపత్తు సహా ఎన్నో ఆటంకాలు దాటుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఉంది? సామాన్య ప్రేక్షకులను మెప్పించిందా లేదా? చూద్దాం.

తమసోమా జ్యోతిర్గమయ

ఇదీ కథ:

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నారాయణ(ఆర్జే విక్కీ)-లక్ష్మీ(రోహిణి ఆరేటి) దంపతులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. నేత పనితో కుటుంబ పోషణ భారమై అప్పులపాలైన నారాయణ ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చనిపోవడంతో నారాయణ కొడుకు కుమార్(ఆనంద్ రాజ్) చదువు మానేసి అదే ఊరిలో ఉన్న సేటు చంద్రయ్య(రచ్చ రామకృష్ణ) దగ్గర పనికి కుదురుతాడు. కుమార్ కు చిన్నప్పటి నుంచి కాగితంపై రకరకాల డిజైన్స్ వేయడం అలవాటు. చంద్రయ్య దగ్గర పని చేస్తూనే డిజైనర్ చీరలకు ధీటుగా మగ్గంపైనే కొత్త రకమైన చీరలు తయారు చేసి చేనేత కళకున్న గౌరవాన్ని పెంచాలని తాపత్రయపడుతుంటాడు. అది చంద్రయ్యకు నచ్చదు. కుమార్ పై కక్ష పెంచుకుంటాడు. తండ్రి చేసిన అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తాడు. ప్రేమించిన వాణి(శ్రావణిశెట్టి)ని కూడా ఆమె తల్లిదండ్రులు కుమార్ కు ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తారు. ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో కుమార్ ఏం చేశాడు? తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది తెరపై చూడాల్సిందే.

తమసోమా జ్యోతిర్గమయ

ఎలా ఉందంటే:

'తమసోమా జ్యోతిర్గమయ' కేవలం గంటన్నర సినిమా. కానీ ఆ గంటన్నరలో చేనేత కళాకారుల జీవితాన్ని, ఆ కుటుంబాల్లోని జీవన పోరాటానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. జన్మనిచ్చిన తల్లి పేగుబంధం కోసం.. బతుకు నేర్పే పోగు బంధం కోసం పరితపించే యువకుడి జీవితం ఈ సినిమా. Necessity is the mother of invention అంటారు.. కానీ.. Mother is the necessity of invention అని చాటి చెప్పే చిత్రం. కేవలం చేనేతనే కాదు.. అన్ని రంగాల కళాకారులకు స్ఫూర్తిగా నిలిచే చిత్రం. గతంలో మల్లేశం చూసిన ప్రతి ప్రేక్షకుడు చేనేత కళను ఎంత గొప్పదని భావించాడో ఆ గొప్పతనాన్ని, వాళ్ల కష్టాన్ని కళ్లారా చూపించే చిత్రం ఇది. చేనేత కుటుంబంలో పుట్టిన కుమార్ అనే యువకుడి జీవితం చిన్నప్పటి నుంచి ఎలా సాగిందో చూపిస్తూ.... చేనేత రంగంలోని లోటుపాట్లను, పెత్తందారి వ్యవస్థను సూటిగా ప్రశ్నించాడు దర్శకుడు విజయ్. ప్రథమార్థం కథానాయకుడి బాల్యం, చేనేత కళాకారుల జీవితాలు, ఆకలిచావులు, కథానాయికతో ప్రేమ వ్యవహారంతో సాగుతుంది. ద్వితీయార్థానికి వచ్చేసరికి కథానాయకుడి లక్ష్యం దిశగా కథ కొనసాగుతుంది. నేత పని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాల్లో భావోద్వేగాలు కంటతడి పెట్టిస్తాయి. చేనేత వృత్తిలో ఉన్న యువతకు పిల్లను ఇవ్వడానికి నిరాకరించే సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. చేనేత కళారంగంలో ఇక్కత్ తయారీ ఎలా జరిగిందో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. చేనేత చీరలకు ఎందుకు అంత ఖరీదు ఉంటాయో కళ్లకు కడుతుంది. అలాగే చక్కటి గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన సన్నివేశాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను తమ తమ గ్రామాల్లోకి తీసుకెళ్తాయి.

తమసోమా జ్యోతిర్గమయ

ఎవరెలా చేశారంటే:

ఇందులో నటించిన ప్రధాన తారగణమంతా కొత్తవాళ్లే. అయినా తెరపై ఎక్కడా ఆ లోటు లేకుండా నటించారు. కుమార్ పాత్రలో నటించిన ఆనంద్ రాజ్ సినిమాను తన భుజాలపై మోశాడు. ప్రతి సన్నివేశంలో ఎంతో అనుభవం ఉన్న నటుడిగా కుమార్ పాత్రను నడిపించాడు. గతంలో సరదాగా మగ్గం నేర్చుకున్న అనుభవం ఆనంద్ రాజ్ కు ఈ సినిమాలో ఉపయోగపడింది. భావోద్వేగాలు పండించడంలో ఇంకాస్తా అనుభవం అవసరం. అలాగే కథానాయిక శ్రావణి శెట్టి వాణి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. నిండైన చేనేత చీరకట్టుతో సినిమాకు అందాన్ని తీసుకొచ్చింది. చంద్రయ్య పాత్రలో నటించిన రచ్చ రామకృష్ణ తన పాత్ర పరిధి మేరకు నటించి చేనేత సొసైటీల్లో ఉన్న సేట్లను గుర్తు చేస్తాడు. అలాగే కుమార్ స్నేహితుడిగా యాదగిరి పాత్రలో నటించిన జనార్దన్ ప్రేక్షకులకు తనదైన మాటలతో వినోదాన్ని పండిస్తూ ఊరటనిస్తాడు. మిగతా పాత్రలన్నీ భూదాన్ పోచంపల్లికి చెందిన వ్యక్తులే తెరపై కనిపిస్తారు. ఇక ఈ చిత్రానికి ప్రధాన భూమిక పోషించింది దర్శకుడు విజయ్. కెమెరామెన్ శ్రావణ్, సంగీత దర్శకుడు ప్రశాంత్. ఈ ముగ్గురికి ఇది తొలి సినిమానే కావడం విశేషం. విజయ్ ఆలోచనలకు అనుగుణంగా శ్రావణ్ తన కెమెరాతో చక్కటి విజువల్స్ ఇచ్చాడు. వెండితెరకు ఆకుపచ్చని కోక కట్టి అందంగా తన కెమెరాతో మాయ చేశాడు. అంతేకాకుండా ఎడిటింగ్ లోనూ శ్రావణ్ పనితనం కనిపిస్తుంది. విజయ్, శ్రావణ్ లకు పోటీగా ప్రశాంత్ అందించిన సంగీతం సినిమాకు బలాన్ని చేకూర్చింది. చిన్న సినిమానే అయినా సన్నివేశానికి తగిన పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించి తీరు ప్రేక్షకులను గంటన్నరపాటు పోచంపల్లి ఉన్న అనుభూతి కలుగుతుంది. సంగీత దర్శకుడిగానే కాకుండా రచయితగానూ ప్రశాంత్ రాసిన అయ్యయ్యో పాట వినసొంపుగా ఉండగా...పెద్దింటి అశోక్ రాసిన నువ్వొక చలనం పాట యువతను ఆలోచింపజేస్తుంది. 60 ఏళ్ల ముసలాయన భార్య మందుల కోసం నూలు దొంగతనం చేసే సందర్భంలో వచ్చే మాటలతోపాటు కథానాయకుడు " ఊరిని నేను చూస్తునట్టు లేదు... ఊరే నన్ను చూస్తున్నట్టుంది", "నేను బతుకుడు కాదు... నా బతుక్కేందో తెల్వాలి", "కాలానికి అనుగుణంగా కళను బతికించుకోవాలి" లాంటి మాటలు చప్పట్లు కొట్టిస్తాయి. చేనేత వ్యాపారి అయిన తడక రమేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం నిర్మాణ పరంగా తమసోమా జ్యోతిర్గమయకు బాగా కలిసొచ్చింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు:

+కథ

+ఆనంద్ రాజ్

+సంగీతం

+విజువల్స్

+దర్శకత్వం

బలహీనతలు:

-వినోదపాళ్లు లోపించడం

-అక్కడక్కడ నెమ్మదిగా సాగే సన్నివేశాలు

చివరగా:చేనేత కళాకారులపై గౌరవాన్ని పెంచే చిత్రం.. తమసోమా జ్యోతిర్గమయ

ఇదీ చూడండి: Natyam Review: 'నాట్యం' ఎంతవరకు ఆకట్టుకుంది?

ABOUT THE AUTHOR

...view details