తెలంగాణ

telangana

పెట్రో మంటలకు ప్రభుత్వాల ఆజ్యం

By

Published : Jan 29, 2021, 9:21 AM IST

CENTRAL AND STATE GOVERNMENTS ARE RISING THE FUEL RATES WITH THE TAXES
పెట్రో మంటలకు ప్రభుత్వాల ఆజ్యం ()

దేశంలో ఇంధన ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్​లో లీటర్​ డీజిల్​ ధర రూ.83లకు ఎగబాకగా.. జైపుర్​, ముంబయి నగరాల్లో లీటర్​ పెట్రోల్​ రేటు రూ.90పైబడి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక రాజస్థాన్​లోనైతే ప్రీమియర్ పెట్రోల్​ లీటర్​ రూ.100 దాటింది. రేటు క్షీణించినప్పుడూ ఉపశమనానికి నోచుకోని కోట్లాది వినియోగదారులకు 'అంతర్జాతీయ విపణికి అనుగుణంగా సర్దుబాటు' పేరిట ఆనవాయితీగా పెట్రో మంటల పెను సెగ తప్పడంలేదు. అసలే చితికిపోయిన బతుకులు చమురు ధరాఘాతాల పాలబడి కమిలిపోకుండా- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చితుకులు పేర్చడం మానుకోవాలి!

దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు కళ్ళెంలేని గుర్రంలా దౌడు తీస్తూ మునుపెన్నడూ ఎరుగని గరిష్ఠ స్థాయికి చేరి హడలెత్తిస్తున్నాయి. యావత్‌ దేశంలోనే అత్యధికంగా లీటరు డీజిల్‌ ధర హైదరాబాదులో రూ.83లకు పైబడగా, జైపూర్‌ ముంబై నగరాల్లో పెట్రోలు రేటు రూ.90లకు మించిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. రాజస్థాన్‌లో ప్రీమియం పెట్రోలు లీటరు రూ.100పైనే! 2018 అక్టోబరులో లీటరు పెట్రోలు సుమారు రూ.80, డీజిల్‌ రూ.75 వరకు పలికినప్పుడు అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ ముడి చమురు 80 డాలర్లకు చేరువలో ఉంది. ఏడాది క్రితం 70 డాలర్లున్న పీపా ముడిచమురు ధర మూడు నెలల వ్యవధిలోనే సగానికి తెగ్గోసుకుపోయింది. నేడది 55 డాలర్ల వద్ద ఉండగా, రిటైల్‌ చమురు ధరలేమో గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతున్నాయి. రేటు క్షీణించినప్పుడూ ఉపశమనానికి నోచుకోని కోట్లాది వినియోగదారులకు 'అంతర్జాతీయ విపణికి అనుగుణంగా సర్దుబాటు' పేరిట ఆనవాయితీగా పెట్రో మంటల పెను సెగ తప్పడంలేదు.

సుంకాల పేరుతో..

ప్రస్తుత ధరోల్బణానికి 'ఒపెక్‌' (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) మాట నిలబెట్టుకొనకపోవడమే హేతువని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడ్డూర భాష్యం చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా చమురుకు గిరాకీ కుంగి 'ఒపెక్‌' సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు- దేశీయంగానూ డిమాండు పడిపోయినా దిగుమతుల్ని కొనసాగించి ఆ కూటమిని ఆదుకున్నామని, అదిప్పుడు సహేతుక ధరలకు సరఫరాలు కొనసాగిస్తామన్న హామీని ఉల్లంఘించినందువల్లే చమురు మంటలింతగా భగ్గుమంటున్నాయన్నది మంత్రివర్యుల వివరణ! నెపాన్ని మరొకరిపైకి నెట్టేసి, అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగినప్పుడు తరిగినప్పుడు సైతం ఇక్కడ రేట్లు పెంచేస్తూ, ఆ పెంపుదలపై సుంకాలు దండుకుంటున్న ప్రభుత్వాలది... అడ్డగోలు దోపిడి కాదా?

ఎడాపెడా పన్నులు బాదేస్తూ..

దక్షిణాసియాలోనే అత్యధికంగా చమురు ధరలు జనం జేబులకు తూట్లు పొడవడానికి- ఎడాపెడా పన్నులు బాదేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా పుణ్యం కట్టుకుంటున్నాయి. పెట్రోలుపై 56శాతం, డీజిలుపై 36 శాతం దాకా పన్నులు దండుకుంటున్నట్లు లోగడ రంగరాజన్‌ కమిటీ నిగ్గుతేల్చగా- పెట్రోలు రిటైల్‌ ధరలో 67శాతం, డీజిల్‌ రేటులో 61శాతం దాకా సుంకాల వడ్డనేనని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015-20 మధ్యకాలంలో చమురు రంగంనుంచి కేంద్ర రాబడి సుమారు రెండింతలైందని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం 38శాతం విస్తరించిందని అంకెలు చాటుతున్నాయి. కరోనా సంక్షోభవేళ చమురు వినియోగం పెద్దయెత్తున క్షీణతకు గురైనా, కేంద్ర వసూళ్లు పెరగడానికి పన్నుల మోతే కారణమని సీజీఏ(కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌) విశ్లేషణ ధ్రువీకరిస్తోంది.

జీఎస్టీలో చేర్చితే..

కొవిడ్‌ మహమ్మారితో నానావిధ అగచాట్లకు లోనైన జనావళి తిరిగి కార్యకలాపాల్లో నిమగ్నం కావడానికి, దేశార్థికం పుంజుకోవడానికి ఇంధనమే ప్రాణాధారం. అందుకే రేపటి బడ్జెట్లో ఎల్‌పీజీ, కిరోసిన్‌ సహా పెట్రో ఉత్పత్తులన్నింటినీ జీఎస్‌టీ పరిధిలో చేర్చాలన్న సూచనలు వినవస్తున్నాయి. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల పన్నులూ సుంకాల బెడద లేనట్లయితే లీటరు పెట్రోలు దాదాపు 30 రూపాయలకే లభిస్తుందన్న అంచనాల నేపథ్యంలో- సహేతుక స్థాయికి వడ్డన పరిమితమయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాచుకోవాలి. ఒక స్థాయికి మించి అంతర్జాతీయంగా ధరలు పోటెత్తినా, వాటిపై పన్నుల విధింపు లేకుండా దేశార్థిక రంగం దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణకు నిబద్ధం కావాలి. అసలే చితికిపోయిన బతుకులు చమురు ధరాఘాతాల పాలబడి కమిలిపోకుండా- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చితుకులు పేర్చడం మానుకోవాలి!

ఇదీ చదవండి:బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

ABOUT THE AUTHOR

...view details