తెలంగాణ

telangana

ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాకు షాక్.. భారత్​కు అప్పగించాలని అమెరికా కోర్టు ఆదేశం

By

Published : May 18, 2023, 7:54 AM IST

Updated : May 18, 2023, 9:32 AM IST

tahawwur-rana-to-india

2008 ముంబయి ఉగ్ర ఘటనతో ప్రమేయం ఉన్న తహవుర్ రాణాను భారత్​కు అప్పగించేందుకు అమెరికా న్యాయస్థానం అనుమతిచ్చింది. పేలుళ్లలో అతడి పాత్ర ఉందన్న భారత అభ్యర్థన మేరకు అతడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

2008 ముంబయి దాడుల కేసులో ప్రమేయం ఉన్న పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవుర్ రాణాను భారత్​కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్​లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది. 2020 జూన్ 10న రాణాను అప్పగించాలని భారత్.. అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారత్ చేసిన అభ్యర్థనకు బైడెన్ ప్రభుత్వం ఇంతకుముందే ఆమోదం తెలపగా.. తాజాగా కోర్టు కూడా రాణాను అప్పగించేందుకు అనుమతిచ్చింది. ముంబయి పేలుళ్లలో రాణా పాత్ర ఉందని భారత్ చేసిన అభ్యర్థన మేరకు అమెరికా అతడిని అరెస్ట్ చేసింది.

పాకిస్థాన్ -అమెరికా సంతతికి చెందిన తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్ మన్ హెడ్లీకి లష్కరే తోయిబా సంస్థతో సంబంధాలు ఉన్నాయనే విషయం తహవుర్ రాణాకు ముందే తెలుసని అమెరికా న్యాయవాదులు కోర్టులో వాదించారు. హెడ్లీకి సహాయం అందించడం ద్వారా రాణా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చాడని కోర్టుకు తెలిపారు. రాణాకు ముంబయి దాడులకు సంబంధించిన ప్రణాళిక ముందే తెలుసని నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి రాణాను భారత్​కు అప్పగించేందుకు అంగీకరించారు.

ప్రధాని మోదీ పర్యటనకు ముందే...
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనుండగా.. దాదాపు నెల ముందు ఈ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా అమెరికా పేర్కొంది. భారత్​తో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగం కావడాన్ని గౌరవిస్తామని తెలిపింది. 2008 ముంబయి ఉగ్రదాడుల దోషులకు శిక్ష పడాలని పిలుపునిచ్చింది.

రెండు సార్లు అరెస్ట్
గతంలో తహవుర్ రాణాను అమెరికా పోలీసులు రెండుసార్లు అరెస్ట్ చేశారు. నేరస్థుల అప్పగింతపై చేసుకున్న అవగాహన ఒప్పందం కింద భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు లాస్‌ ఏంజిల్స్​‌ పోలీసులు 2020లో అతడిని అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న రాణాకు కరోనా వైరస్ సోకిందని విడుదల చేశారు అధికారులు. కొద్దిరోజుల పాటు అతడు బయటే ఉన్నాడు. అయితే, అతడి అరెస్ట్ కోసం భారత ప్రభుత్వం మరోసారి అభ్యర్థన చేసింది. 1997లో భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం మేరకు రాణాను అరెస్ట్ చేయాలని కోరింది. దీంతో 2020 జూన్ 10న మరోసారి రాణాను లాస్ ఏంజిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయి పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాను .. కేంద్రం ఇప్పటికే పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్ర దాడుల్లో 166 మంది మృతిచెందారు.

Last Updated :May 18, 2023, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details