Balakrishna Raviteja Movies : అగ్ర తారల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ తమ సినిమాలతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు సంపాదించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో తమ లుక్స్ నుంచి నటన వరకు అన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండే ఈ స్టార్స్.. రిలీజ్ డేట్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పక్క హీరోల సినిమాలతో క్లాష్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటారు.
ఈ క్రమంలో ఆయా దర్శక నిర్మాతలు సైతం విడుదల తేదీల ఖరారు విషయంలో దృష్టి సారిస్తుంటారు. ఇన్ని చేసినప్పటికీ ఏదో ఒక సమయంలో బాక్సాఫీస్ వద్ద పలువురు స్టార్స్ పోటీపడ్డ సందర్భాలున్నాయి. అలా నందమూరి నటసింహం బాలకృష్ణ- మాస్ మహారాజ రవితేజతమ సినిమాలతో ఒకే సారి థియేటర్లలో దిగి తమ బలాబలాలను పరీక్షించుకున్నారు. రానున్న దసరాకు తమ సినిమాలతో బరిలోకి దిగనున్న ఈ స్టార్ హీరోలు.. ఇప్పటి వరకు ఎన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారంటే..
1. పలనాటి బ్రహ్మనాయుడు - ఒక రాజు ఒక రాణి:
నందమూరి నట సింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన యాక్షన్ మూవీ 'పలనాటి బ్రహ్మనాయుడు'. ఈ సినిమా 2003 జూన్ 13న విడుదలైంది. అయితే రవితేజ హీరోగా వచ్చిన 'ఒక రాజు ఒక రాణి' ఓ వారం గ్యాప్ తీసుకుని జూన్ 19న విడుదలైంది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.
2. అల్లరి పిడుగు - భగీరథ :
ఇక 2005లో అక్టోబర్ 5న బాలకృష్ణ నటించిన 'అల్లరి పిడుగు' సినిమా విడుదలైంది. ఇక ఈ సారి కూడా వారం తర్వాతనే రవితేజ నటించిన 'భగీరథ' విడుదలైంది. ఇక ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోలేకపోయాయి.
3. ఒక్క మగాడు - కృష్ణ :
బాలకృష్ణ కథనాయకుడిగా రుపొందిన 'ఒక్క మగాడు' చిత్రం 2008 జనవరి 11న విడుదలైంది. ఇక జనవరి 12న రవితేజ హీరోగా నటించిన 'కృష్ణ' సినిమా రిలీజైంది. 'ఒక్క మగాడు' ఆశించిన స్థాయిలో హిట్ టాక్ అందుకోనప్పటికీ.. 'కృష్ణ' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.
4. మిత్రుడు- కిక్ :
బాలకృష్ణ లీడ్ రోల్లో వచ్చిన 'మిత్రుడు' సినిమా 2009 మే 1న విడుదలైంది. ఇక ఈ సినిమా రిలీజైన వారం తర్వాత రవితేజ కిక్ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఇక 'మిత్రుడు' సినిమా ప్రేక్షకులను నిరశపరచగా.. కిక్ మాత్రం రవితేజ కెరీర్‌ను ఓ మలుపు తీసుకెళ్లి.. తన ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ వేసింది.
5. పరమ వీర చక్ర - మిరపకాయ్:
2011 సంక్రాంతి బరిలోకి బాలకృష్ణ 'పరమవీరచక్ర' వచ్చింది. ఈ సినిమా జనవరి 12న రిలీజైంది. ఇక ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న రవితేజ కథనాయకుడిగా నటించిన 'మిరపకాయ్' థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల్లో ఒకటి ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోగా.. మరొకటి మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
6. దరువు - అధినాయకుడు :
రవితేజ హీరోగా నటించిన 'దరువు' మూవీ 2012 మే 25న థియేటర్లలో విడుదలైంది. ఇక ఓ వారం గ్యాప్ తీసుకుని జూన్ 1న బాలకృష్ణ లీడ్ రోల్లో 'అధినాయకుడు' వచ్చింది. అయితే ఇందులోనూ ఓ సినిమా కమర్షియల్ హిట్ కాగా.. మరో సినిమా బాక్సాఫీస్ దగ్గ హిట్ టాక్ అందుకోలేకపోయింది.
7. శ్రీమన్నారాయణ - దేవుడు చేసిన మనుషులు :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' మూవీ 2012 ఆగస్ట్ 15న విడుదలైంది. ఇక రెండు వారాల తర్వాత బాలకృష్ణ లీడ్ రోల్లో నటించిన' శ్రీమన్నారాయణ' సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి.
8. వీరసింహారెడ్డి - వాల్తేరు వీరయ్య :
ఇక ఈ ఏడాది కూడా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. జనవరి 11న బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా థియేటర్లలోకి రాగా.. ఆ మరుసటి రోజు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' రిలీజైంది. అయితే ఈ సినిమాలో రవితేజ ఇందులో ఓ స్పెషల్ రోల్లో మెరిశారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.
9. భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు:
ఈ ఏడాది మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు ముందుకొస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్టోబర్ 20న రవితేజ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల కానుంది. అయితే ఇప్పుడు జరగనున్న బాక్సాఫీస్ వార్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.