తెలంగాణ

telangana

3 Friends died in accident: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. తీసింది ముగ్గురు స్నేహితుల ప్రాణం..

By

Published : Aug 28, 2021, 7:29 AM IST

Updated : Aug 29, 2021, 7:03 AM IST

three-members-died-in-bike-accident-at-choutuppal
బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం ()

07:26 August 28

వేబ్రిడ్జి వద్ద నుంచి లారీని రివర్స్ చేస్తుండగా ప్రమాదం

మృతులు హరీశ్, సల్మాన్, ఆసిఫ్

        ముగ్గురు యువకులు.. ఒకే చోట ఉద్యోగం. నాలుగేళ్ల స్నేహం. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం..రావడం ఆనవాయితీ. అలా కలిసే ఓ శుభకార్యానికి వెళ్లిన ముగ్గురూ కలిసే ప్రాణాలు కోల్పోయారు. కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి..స్నేహానికి ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. 

           చౌటుప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లికి చెందిన మేడి హరీష్‌(22), సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వాసి  మహ్మద్‌ సల్మాన్‌(23), హైదరాబాద్‌ పాతబస్తీ వాసి మహ్మద్‌ ఆసిఫ్‌(22) హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని గ్లోబల్‌ టెక్నో సర్వీసెస్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా సంస్థ ఇచ్చిన వసతి గృహాలలో ఉంటూ మంచి స్నేహితులయ్యారు. పండగలు సహా ఇతర సందర్భాల్లో ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంత అనుబంధం వారి మధ్య ఉండేదని, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఇదే తరహాలో హరీష్‌ తన స్వగ్రామంలోని స్నేహితుడి సోదరుని వివాహనికి శుక్రవారం సల్మాన్‌, ఆసిఫ్‌లతో కలిసి వెళ్లాడు. 

           శుభకార్యం ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒకే ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెం దాటి వేబ్రిడ్జిని సమీపిస్తుండగా, వేబ్రిడ్జ్‌ లోపలి ఉంచి రివర్స్‌లో జాతీయ రహదారిపైకి దూసుకొచ్చిన లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ద్విచక్ర వాహనంతోపాటు ముగ్గురూ ఎగిరి జాతీయ రహదారి డివైడర్‌ సమీపంలో పడ్డారు. అలికిడి విన్న పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి వచ్చేలోపే తల, శరీర భాగాలకు తీవ్రగాయాలై ముగ్గురూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ(ఏపీ24టీ 5199) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి గ్రానైట్‌ లోడుతో హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కి వెళ్తోందని పోలీసులు తెలిపారు. ‘గ్రానైట్‌ తూకం కోసం లారీ డ్రైవర్‌ వేబ్రిడ్జిలోకి వెళ్లాడు. రాత్రివేళ సిబ్బంది స్పందించకపోవడంతో రివర్స్‌ గేర్‌ వేసుకుని వేగంగా జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం జరిగిందని’ వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురూ అవివాహితులే. వారిలో ఆసిఫ్‌కు నెల రోజుల కిందట పెళ్లి కుదిరింది.

ఇదీ చూడండి:TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

Last Updated :Aug 29, 2021, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details