తెలంగాణ

telangana

ఈతకు వెళ్లిన బాలుడు అదృశ్యం.. నాలుగు రోజుల తర్వాత..

By

Published : Aug 14, 2021, 1:42 PM IST

boy died

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లొస్తానమ్మా అని చెప్పి బయటకు వెళ్లిన కుమారుడు.. ఓ గంటలో వస్తాడనుకుంది ఆ తల్లి. గంట గడిచి నాలుగు రోజులైంది. అయినా కొడుకు ఇంటికి రాలేదు. ఆ నాలుగు రోజుల్లో బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఫలితం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. చనిపోయి కుళ్లిన స్థితిలో ఉన్న బాలుడిని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు. కడుపు కోతతో వారి రోదనలు మిన్నంటాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉత్కంఠకు దారితీసింది. తమ వెంట వచ్చిన స్నేహితుడు నీట మునిగి చనిపోవడంతో భయపడిన తోటి మిత్రులు అసలు విషయాన్ని నాలుగు రోజులపాటు దాచిపెట్టారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.

ఆడుకుంటానని వెళ్లి

పట్టణంలోని విద్యానగర్​కు చెందిన గట్టయ్య, తిరుమల దంపతుల చిన్న కుమారుడు చైతన్య(14) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 9న మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆడుకునేందుకు స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాడు. రాత్రి అయినా కుమారుడు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, స్థానికుల ఇళ్లలో వెతికారు. అయినా జాడ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుళ్లిపోయిన స్థితిలో

విచారణ చేపట్టిన పోలీసులు.. చైతన్య తన నలుగురు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ ఎర్రగుంటపల్లి వాగు వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి స్నేహితులను పిలిపించి విచారణ చేపట్టగా మొదట తమకు ఏమీ తెలియదని చెప్పారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిన్న అర్ధరాత్రి వాగు వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ చైతన్య దుస్తులను గుర్తించారు. అనంతరం సింగరేణి రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. రెండున్నర గంటలు శ్రమించిన అనంతరం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గల్లంతైన విషయాన్ని దాచిన స్నేహితులు, వారి కుటుంబ సభ్యులపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:Jagtial News : రాత్రంతా శవానికి పూజలు.. ఇక బతికిరాడని చివరికి ఏం చేశారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details