తెలంగాణ

telangana

కలెక్టర్‌ పేరుతో వాట్సాప్‌ ఫేక్​ అకౌంట్... ఆ తర్వాత..

By

Published : Apr 16, 2022, 6:59 AM IST

jharkhand gang cyber scam fake whatsapp account in the name of narayanapet district collector
కలెక్టర్‌ పేరుతో వాట్సాప్‌ ఫేక్​ అకౌంట్... రూ.2.40 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాడు ()

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్‌ ఖాతాను సృష్టించాడు.

ఓ సైబర్‌ నేరగాడు ఏకంగా నారాయణపేట జిల్లా కలెక్టర్‌ పేరిట వాట్సాప్‌ ఖాతా సృష్టించి తద్వారా ఒక వ్యక్తి నుంచి రూ.2.40 లక్షలు నగదు బదిలీ చేయించుకున్న ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపిన కథనం మేరకు... గుర్తు తెలియని వ్యక్తి (8210616845) నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన పేరు, ఫొటోతో వాట్సeప్‌ ప్రొఫైల్‌ సృష్టించాడు. దాని నుంచి జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులు, వృత్తి నిపుణులకు తాను సమావేశంలో ఉన్నానని, ఒక కొనుగోలు విషయమై డబ్బులు పంపాలని గురువారం సందేశాలు పంపించాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృత్తి నిపుణుడు స్పందించి మూడుసార్లు కలిపి రూ.2.40 లక్షలు ఆమె ఖాతాకు బదిలీ చేశారు. తరువాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌ పేరుతో ప్రొఫైల్‌ సృష్టించి డబ్బులు కాజేసిన వ్యక్తి ఝార్ఖండ్‌కు చెందినవాడని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌ ద్వారా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేసి విచారిస్తామన్నారు. ఈ నకిలీ వాట్సప్‌ నంబరుతో నారాయణపేట జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధంలేదని దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్‌ హరిచందన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని నుంచి ఎవరికైనా సందేశాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందేందుకు ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details