తెలంగాణ

telangana

చెన్నకేశవస్వామి భూములకు... యాజమాన్య హక్కు పొందేందుకు ప్రయత్నాలు!

By

Published : Sep 11, 2021, 12:29 PM IST

Updated : Sep 11, 2021, 1:53 PM IST

attempt-to-acquire
దేవాలయ భూములు ()

ఉమ్మడి జిల్లాలో దేవాలయ భూముల అన్యాక్రాంతాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలోని చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన భూములకు యాజమాన్య హక్కు పొందేందుకు ప్రయత్నిస్తున్న తీరు.. వాటిని విక్రయించడానికే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల కిందట ఆ ప్రాంతాన్ని చదును చేయడం.. స్థానికుల సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఆలయ భూములపై పట్టా హక్కులు పొంది, వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వారికి అధికారుల అండదండలూ ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలోని చెన్నకేశవస్వామి ఆలయానికి సర్వే నంబర్‌ 525లో 55.27 ఎకరాల భూమి కేశవస్వామి మారిఫత్‌ పూజారి కల్యాణచారి పేరిట ఉంది. ధరణి రికార్డుల ప్రకారం అవి దేవాదాయశాఖ భూములుగా, చౌతా ఇనామ్‌ భూములుగా నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా పూజారుల అధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ సాగుతోంది. ఇటీవల ఈ భూముల్ని అమ్మేశారనే ప్రచారం సాగింది. దాదాపు ఆరు నెలల కిందట యంత్రాలతో ఆ భూముల్ని చదును చేశారు. గతంలో ఆ భూముల నుంచి మట్టిని తరలించడం సైతం వివాదాస్పమైంది. రెవెన్యూ అధికారులకు సమాచారం అందడంతో మట్టి తరలింపును నిలిపివేశారు. వాస్తవానికి దేవాదాయశాఖకు సంబంధించిన ఇనాం భూముల్ని అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. అలాంటిది వాటిని ఎలా అమ్ముతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విక్రయించ వీలులేకున్నా..

దేవాదాయ చట్టం, ఇనాం చట్టాల ప్రకారం దేవాలయాల నిర్వహణ కోసం ఇనాంగా పొందిన భూముల్ని ఇనాందారులు వారసత్వంగా అనుభవించేందుకు అవకాశం ఉంది. కానీ విక్రయించేందుకు వీలులేదు. కానీ ప్రస్తుతం చెన్నకేశవస్వామి ఆలయ భూములున్న ప్రాంతం బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ.40 లక్షలు పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములపై ఓఆర్సీ పొందడం ద్వారా వాటిని అమ్మేందుకు గట్టి ప్రయత్నాలే సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు జిల్లా ఉన్నతాధికారుల అండదండలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

చెన్నకేశవస్వామి భూములకు... యాజమాన్య హక్కు పొందేందుకు ప్రయత్నాలు!

చర్యలు తీసుకుంటాం

దేవరకద్ర చెన్నకేశవ ఆలయం సెక్షన్‌ 43 కింద దేవాదాయశాఖ దస్తాల్ల్రో నమోదు కాలేదు. రెవెన్యూ దస్తాల్ల్రో భూములు దేవాలయం పేరు మీదే ఉన్నాయి. ఈ మధ్య వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఇన్‌స్పెక్టర్‌ని ఆదేశించాం. నివేదిక అందిన తరవాత తదుపరి చర్యలు తీసుకుంటాం. దేవాలయానికి ఇనాముగా ఇచ్చిన భూములు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. వాటిని అన్యాక్రాంతం కాకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైన క్షేత్రస్థాయిలో పరిశీలించి బోర్డులు సైతం ఏర్పాటు చేస్తాం.

- శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్‌, దేవాదాయశాఖ

ఆలయ భూములకు రక్షణ కల్పిస్తాం

చెన్నకేశవస్వామి ఆలయ భూములకు రక్షణ కల్పిస్తాం. ఆ భూమి క్రయ విక్రయాలు జరిపేందుకు ఎవరికీ హక్కులు లేవు. భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి, బోర్డులు పెట్టిస్తాం. వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా గ్రామ పంచాయతీకి, భూమి విక్రయం కాకుండా తహసీల్దార్‌కు సూచిస్తాం. భూమి రక్షణ, అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కల్టెకర్‌కు నివేదిక అందిస్తాం.

- రమాదేవి, దేవాదాయశాఖ ప్రత్యేక ఉప కలెక్టర్‌

ఆలయ భూములపై ఓఆర్సీ కోసం దరఖాస్తులున్నాయని ఆర్డీవో పద్మశ్రీ తెలిపారు. ఈ అంశంపై స్థానిక తహసీల్దార్‌, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ నుంచి నివేదికలు తెప్పించుకున్నామని వెల్లడించారు. ఓఆర్సీ దరఖాస్తుపై దరఖాస్తుదారులకు, దేవాదాయశాఖకు సైతం నోటీసులు జారీ చేస్తామని... దస్త్రాల సాక్ష్యాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన సైతం చేపడతామన్నారు. దేవాదాయ, ఇనాం చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పద్మశ్రీ తెలిపారు. మరోవైపు ఎలాగైనా భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని జనం కోరుతున్నారు.

ఇదీ చూడండి:REGISTRATION CHARGES: ఆగస్టు నెలలో పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం.. ఎందుకంటే!

Last Updated :Sep 11, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details