తెలంగాణ

telangana

దేవరుప్పుల ఘటనలో గాయపడిన భాజపా కార్యకర్త పరిస్థితి విషమం

By

Published : Aug 16, 2022, 12:27 PM IST

devaruppula

నిన్న జనగామ జిల్లా దేవరుప్పుల దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన భాజపా కార్యకర్త పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో నిన్న తెరాస నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన భాజపా కార్యకర్త పరిస్థితి విషమంగా ఉంది. సర్పంచ్ అయిన రావుల మల్లేష్ యాదవ్‌ను మెరుగైన చికిత్స కోసం... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే యశోద ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిన్న దేవరుప్పులలో జరిగిన ప్రజాసంగ్రామ యాత్రలో కంకర రాళ్లు విసరడంతో.. మల్లేశ్ యాదవ్ తల పగిలి, మెడ నరాలు చిట్లాయి.

అసలేం జరిగిందంటే..భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి పాదయాత్ర ప్రవేశించడంతో స్థానిక భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ సంజయ్‌ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతుండగా భాజపా, తెరాస కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.

పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది తెరాస కార్యకర్తలు.. భాజపా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని తెరాస కార్యకర్తలు నిలదీశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details