తెలంగాణ

telangana

కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం

By

Published : May 22, 2021, 5:30 AM IST

corona ayurvedic medicine news
corona ayurvedic medicine news

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్‌ శాఖ బృందం పరిశీలించింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు కృష్ణపట్నం వెళ్లిన బృందం మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి వరకూ మందు పంపిణీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుపై శాస్త్రీయ నిర్థరణకు కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధన సంస్థకు చెందిన వైద్యుల బృందం ఎల్లుండి కృష్ణపట్నం రానుంది. మరోవైపు ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.

ఆనందయ్య మందు కోసం పోటెత్తిన జనం

కృష్ణపట్నం ఆయుర్వేద మందు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశమిది. కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశం ఇబ్బందిపడుతున్న వేళ నెల్లూరులోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కొన్ని రోజులుగా జనం బారులు తీరుతున్నారు. దాదాపు 20 రోజులుగా ఆనందయ్య ఈ మందును ఉచితంగా కరోనా రోగులకు అందిస్తున్నారు.

శుక్రవారం నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 6గంటలకే వేలాది మందితో గ్రామం కిక్కిరిసింది. తొమ్మిది గంటల సమయంలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రజలు ఎగబడ్డారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. క్యూలైన్‌లలో స్వల్ప తోపులాట కూడా జరిగింది. కొందరు అంబులెన్సుల్లో కరోనా రోగులను కృష్ణపట్నానికి తీసుకువచ్చారు. గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం నుంచి పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు ఇచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తారని చెప్పడంతో ప్రజలు ఆందోళన చేశారు.

ఎవరీ ఆనందయ్య..

కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య డిగ్రీ వరకూ చదువుకున్నారు. ఆయన చదువుకునే సమయంలోనే ఆయుర్వేదంపై పట్టుసాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో పాటు కొంతమంది మేధావుల దగ్గర సలహాలు తీసుకుని వనమూలికలు, ఇతర పదార్థాలతో కరోనా మందు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అల్లం, తాటిబెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు, మామిడి చిగుళ్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింటి ఆకుల చెట్టు, తెల్లజిల్లేడు, పూలమొగ్గలు, ముళ్ల వంకాయలతో మందు తయారు చేసినట్లు ఆనందయ్య తెలిపారు. ఔషధం తీసుకున్న వారికి కరోనా తగ్గుతోందనే ప్రచారంతో జనం ఎగబడ్డారు.

అధ్యయనం చేయాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య..

కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డీజీతో మాట్లాడారు. అధ్యయనం చేసి త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధరణ చేయించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో ఆయుష్ కమిషనర్, అధికారులు కృష్ణపట్నంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. ఆనందయ్య మందు తయారుచేస్తున్న వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాత్రి వేళ... కలెక్టర్‌ చక్రధరబాబుతో బృంద సభ్యులు మాట్లాడారు. ఆయుర్వేద మందుకు సంబంధించిన పరీక్షలు కొన్ని పూర్తి కావాల్సి ఉందన్నారు. అప్పటివరకు పంపిణీ నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధనకు చెందిన వైద్యుల బృందం కూడా సోమవారం కృష్ణపట్నం వస్తుందని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ తెలిపారు.

పోలీసుల భద్రత..

ఐసీఎంఆర్‌ నివేదిక ఇచ్చిన తర్వాతనే ఆనందయ్య మళ్లీ మందు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు రావడంతో నెల్లూరు ఎస్పీ వాటిని ఖండించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు.

ఇవీచూడండి:కృష్ణపట్నం చేరుకున్న ఐసీఎంఆర్ బృందం

ABOUT THE AUTHOR

...view details