తెలంగాణ

telangana

KCR About National Politics : కేసీఆర్ నోట.... ''భారత రాష్ట్ర సమితి'

By

Published : Apr 27, 2022, 12:49 PM IST

Updated : Apr 27, 2022, 1:54 PM IST

KCR About National Politics

KCR About National Politics : తెరాస 21వ ప్లీనరీ సమావేశంలో గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం.. జాతీయ రాజకీయాల్లో ఆయన ఎంట్రీ ఖాయమనే మాటకు బలాన్ని చేకూర్చుతోంది. ఓవైపు దేశానికి కావాల్సింది నేషనల్ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా అంటూనే.. మరోవైపు హైదరాబాద్ వేదికగా ఆ అజెండా వస్తే అది రాష్ట్రానికే గర్వకారణమనడం.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారనడానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట.. ఆయన పక్కాగా జాతీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే మాటకు బలాన్నిస్తోంది.

కేసీఆర్ మనసులో మాట.. ''భారత రాష్ట్ర సమితి' వచ్చే అవకాశం

KCR About National Politics : దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ తన సత్తా చూపిస్తారా? దేశానికి కావాల్సింది నేషనల్ ఫ్రంట్ కాదంటూనే.. జాతీయ పార్టీ పెట్టే యోచనలో సీఎం ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారా? తెరాస 21వ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత ఇవన్నీ నిజమేనని అనిపిస్తోంది. దాదాపు గంటన్నరపాటు జరిగిన కేసీఆర్ ప్రసంగంలో ఎక్కువ భాగం.. దేశ రాజకీయాలపైనే మాట్లాడటం త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఖాయం అనడానికి ఊతమిస్తోంది.

కేసీఆర్ నోట.... ''భారత రాష్ట్ర సమితి'

తెరాస 21వ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత ప్రసంగం.. పార్టీ గత విజయాలు.. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ కంటే.. దేశ రాజకీయాలు.. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయం వంటి అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపించింది. ఓవైపు దేశానికి కావాల్సింది.. రాజకీయ ఫ్రంట్‌లు కాదంటూనేే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి పార్టీ పెట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయనడం త్వరలోనే దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయనడానికి నిదర్శనంలా కనిపిస్తున్నాయి. దేశ ప్రజల అభివృద్ధికి కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలంటూనే.. భారత్ బాగుపడటానికి తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమనడం.. హైదరాబాద్ వేదికగా దేశరాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారనే ఆలోచనకు బలం చేకూరుస్తోంది.

భారత రాష్ట్ర సమితి:దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. దేశ గతి, స్థితిని మార్చే.. ప్రజల అభివృద్ధికి సహకరించే ప్రత్యామ్నాయ అజెండా కావాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశం బాగు కోసం తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. భారతదేశం వద్ద తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని.. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రగతి జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. భారత్ దేశంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి కావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలని వ్యాఖ్యానించారు.

ఆకలి కేకలెందుకు :దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారని కేసీఆర్ తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నారని చెప్పారు. కానీ దానికి తాను వ్యతిరేకించానని వెల్లడించారు. దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతులు, అభివృద్ధిని పూర్తిస్థాయిలో కల్పించాలని అన్నారు. 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలెందుకున్నాయని ప్రశ్నించారు.

ఇవీ చదవండి :

దేవుడికి దండం పెట్టి ముందడుగేశా :"2000లో నేను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా అన్నారు. నేను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశాను. ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. కరోనా సమయంలో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో సారి గెలిచాక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేలా పాలించాం. 85 శాతం మొక్కలు బతకకపోతే తెరాస వారైనా సర్పంచ్‌ పదవి పోతుందని చెప్పాం. పల్లెప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. అందువల్లే పల్లె ప్రగతిలో 1 నుంచి 10 వరకు అవార్డులు వచ్చాయి. కొన్ని వందల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రానికి ఇచ్చింది."

- కేసీఆర్, తెరాస అధినేత, ముఖ్యమంత్రి

రాజకీయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ అజెండా :దేశం ఒకే లక్ష్యం దిశగా సామూహిక పయనం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. లక్ష్యం లేని దిశలో చీకట్లో బాణం సంధిస్తున్నామని.. క్రమశిక్షణతో, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. సాగుకు అందుబాటులో ఉండే భూమి పరంగా చైనా కంటే భారత్ ముందుందని.. అయినా భారత్‌ను మించి ఇవాళ చైనా పైస్థాయిలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక జిల్లా అంతలేని ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు కొంటున్నామన్న కేసీఆర్.. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అపారమైన జలసంపద, ఖనిజ సంపదలున్న భారతదేశం మాత్రం ప్రగతిలో ఎందుకు వెనకబడి ఉంటుందని అడిగారు. అందుకే దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించి.. ప్రజల అభ్యున్నతికి తోడ్పడే ప్రత్యామ్నాయ అజెండా రావాలని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Apr 27, 2022, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details