తెలంగాణ

telangana

దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు.. 'భూత్​మామ' గుడిలో విచిత్ర పూజలు!

By

Published : Mar 7, 2023, 8:47 AM IST

unique temple in surat where cigarette offered to god

దేవునిపై భక్తి, విశ్వాసం ఉన్నవారు తమ కోరికలు నెరవేరాలని బంగారం, వెండి వస్తువులను సమర్పిస్తుంటారు. కానీ గుజరాత్​లో ఒక ప్రత్యేక ఆలయం ఉంది. అక్కడికి వచ్చే భక్తులు.. గుడిలో సిగరెట్‌లు నైవేద్యంగా పెడుతున్నారు.

గుజరాత్​లోని సూరత్​లో దేవుడికి సిగరెట్ నైవేద్యంగా సమర్పించే ప్రత్యేకమైన ఆలయం ఉంది. తాము కోరిన కోరికలు నెరవేరితే భక్తులు దేవుడి దగ్గర సిగరెట్ వెలిగించి మొక్కుబడి తీర్చుకుంటారు. సూరత్​లోని అథ్వాలిన్స్ ప్రాంతంలోని ఆదర్శ్ సొసైటీలో వంజారా భూత్​మామ అనే చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయం చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ, భక్తులకు ఇక్కడి దైవంపై అపారమైన నమ్మకం. 130 ఏళ్ల క్రితం ఇక్కడ అకాల పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో వంజరుల సమూహం ఇక్కడ నివసించేవారు. ఆ సమయంలో ఒక వంజర మరణించాడు. అతని సమాధిని ఇక్కడ నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని వంజర భూత్​మామ అని పిలుస్తారు. క్రమంగా ఇక్కడ వంజారా భూత్​మామ ఆలయం ఏర్పాటైంది. 130 సంవత్సరాల నాటి ఒక చెట్టు సైతం ఆ ఆలయ సమీపంలో ఉంది. ఇక్కడే భక్తులు సిగరెట్లు వెలిగించి దైవాన్ని కొలుస్తున్నారు. ఇలా చేస్తే.. భక్తుల కోరికలు తీరుతాయని స్థానికుల నమ్మకం.

సూరత్​లో భూత్​మామ ఆలయంలో దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు

సిగరెట్లే కాకుండా మగాస్ అనే మిఠాయిలు కూడా భూత్​మామకు నైవేద్యంగా పెడతారు. మాగాస్ స్వీట్లను సమర్పిస్తే.. చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని ప్రజలు నమ్ముతారు. మాగాస్ స్వీట్లను తమ దగ్గర పెట్టుకుంటే వారికి మంచి ఉద్యోగం వస్తుందని కూడా విశ్వసిస్తారు. ఈ స్వీట్ గురించి చాలా తక్కువ మంది విని ఉంటారు. ఎందుకంటే, ఇది ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తినే స్వీట్. ఇది శెనగపిండి, డ్రై ఫ్రూట్స్, చక్కెరతో చేసిన స్వీట్.

సూరత్​లో భూత్​మామ ఆలయంలో దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు

'ఈ ఆలయం 130 సంవత్సరాలకు కంటే పురాతనమైనది. మా ముత్తాత ఇక్కడ పూజలు చేసేవారు. ఆయనను మేము దేవుడిగా భావిస్తాం. అందుకే దీనిని భూత్​మామ దేవాలయం అని కూడా పిలుస్తాము. పూర్వం మా ముత్తాతలు బీడీలను దైవానికి సమర్పించేవారు. ఇప్పుడు మేము సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ఏదైనా కోరిక తీరినప్పుడు ప్రజలు సిగరెట్​ను దైవం దగ్గర కాల్చుతారు' అని ఆలయ సంరక్షకుడు అశోక్‌భాయ్ పేర్కొన్నారు.

'ఆదివారం భక్తులు అధికంగా ఆలయానికి వచ్చి సిగరెట్లను నైవేద్యంగా పెడుతుంటారు. ప్రతి సంవత్సరం అందరికీ భోజనాలను పెడుతుంటాం. దీనికోసం 15వేల మందికి పైగా ప్రజలు వస్తారు. ఇదే మన కుల దైవం అంటూ మా తాత ప్రాణాలు విడిచారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తీర్చేవారు. సమాజంలో ఎలాంటి సమస్యలు రావొద్దని దైవానికి సేవ చేస్తుంటాం. గత 14-15 సంవత్సరాలుగా భూత్​మామ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలకు గుజరాత్​ నుంచి మాత్రమే కాకుండా ముంబయి, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటార'ని అశోక్​భాయ్ తెలిపారు.

సూరత్​లో భూత్​మామ ఆలయంలో దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు

భూత్​మామ ముందు సిగరెట్ వెలిగించిన తర్వాత దానిని తన నోటి దగ్గర 3సార్లు ఉంచి తీసేస్తారు. సిగరెట్​ను గుడి పక్కన ఉన్న కుందూలో పక్కన ఉంచుతారు. కాల్చిన సిగరెట్లను గుడిలో పడేయకుండా, పరిసరాలను కలుషితం చేయకూడదనే నెపంతో వాటిని బయట పడేస్తారు. సిగరెట్ కాల్చడం ద్వారా కోరికలు నెరవేరుతాయని భక్తుడు యతిన్ పటేల్ అన్నారు. 'నేను చాలా సంవత్సరాలుగా సిగరెట్లను నైవేద్యంగా సమర్పిస్తున్నాను. దీపం నుంచి సిగరెట్ వెలిగించి, మామదేవ్ నోటి దగ్గర మూడు సార్లు ఉంచుతార'ని ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details