తెలంగాణ

telangana

'ఒక్కరోజులోనే ఎంపికా?'.. ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీం ప్రశ్నలు.. తీర్పు రిజర్వ్

By

Published : Nov 24, 2022, 12:22 PM IST

Updated : Nov 24, 2022, 3:22 PM IST

SUPREME COURT EC COMMISSIONER

ఆగమేఘాల మీద కేంద్ర ఎన్నికల కమిషనర్​గా అరుణ్ గోయల్ నియామకం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయశాఖ సూచించిన నలుగురిలో అరుణ్‌ గోయల్‌నే ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించింది.

ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ నియామక ప్రక్రియలో కేంద్రం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియను ఆగమేఘాల మీద, త్వరితగతిన పూర్తిచేసినట్లు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్ అర్హతలను ప్రశ్నించడం లేదన్న ధర్మాసనం... నియామక ప్రక్రియను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించి పూర్తి దస్త్రాలను ధర్మాసనం ముందు ఉంచాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పత్రాలను సమర్పించగా.. వాటిని పరిశీలించిన కోర్టు... ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 'ఒక్కరోజులోనే ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారా?' అని ప్రశ్నించింది.

"24 గంటలు కూడా గడవక ముందే మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. ఫైల్‌ మొదలు పెట్టిన రోజు నుంచి అపాయింట్‌మెంట్‌ వరకు.. ఎంపిక ప్రక్రియ అంతా ఒకే రోజులో ఎలా జరిగింది? మే 15వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది. మే 15 నుంచి నవంబర్ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలి. నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే... వారిలో అరుణ్‌ గోయల్‌ పేరును మాత్రమే ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ప్రతిపాదిత పేర్లలో అరుణ్‌ గోయల్‌ చిన్నవారు అయినా... మిగిలిన వారిని కాదని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడం, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా... కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోవద్దు."
-సుప్రీంకోర్టు

సుప్రీం ప్రశ్నలకు స్పందించిన అటార్నీ జనరల్‌.. ఎన్నికల కమిషనర్‌ ఎంపికలో ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేశారు. గతంలోనూ 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగాయన్నారు. న్యాయశాఖ ప్రతిపాదించిన 4 పేర్లను D.O.P.T. డేటాబేస్‌ నుంచే తీసుకున్నారని.. వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని... వయసుకు బదులుగా బ్యాచ్‌ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారని బదులిచ్చారు. సుప్రీం తీర్పుతో ఎగ్జిక్యూటివ్‌లోని చిన్న చిన్న విషయాలను కూడా సమీక్షిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోందని ఏజీ వ్యాఖ్యానించారు. ఈ కేసులోని పూర్తి అంశాలను ధర్మాసనం పరిశీలించాలని ఏజీ కోరారు.

తీర్పు వాయిదా
వాదనలన్నీ విన్న ధర్మాసనం.. ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయంప్రతిపత్తి అంశంపై తీర్పు వాయిదా వేసింది. నాలుగు రోజుల విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు ఐదు రోజుల సమయం ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను న్యాయమైన, పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? లేదా? అన్న విషయంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది.

1985 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి అరుణ్‌ గోయల్‌... నవంబర్ 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. నవంబర్ 19న ఆయన్ను... ఎన్నికల కమిషనర్‌గా కేంద్ర న్యాయశాఖ నియమించింది. నలుగురి పేర్లతో కూడిన దస్త్రం ప్రధాని ముందు ఉంచగా.. ఎంపిక ప్రక్రియ చకచకా జరిగిపోయింది. 24 గంటల్లోపు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన కమిషనర్ల నియామక విషయంలో కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

Last Updated :Nov 24, 2022, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details