తెలంగాణ

telangana

ఎస్పీ-ఆర్​ఎల్​డీ పొత్తు ఖరారు- అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ!

By

Published : Dec 7, 2021, 9:56 PM IST

SP RLD
ఎస్పీ ఆర్​ఎల్డీ ()

RLD SP Rally 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్​ఎల్​డీ) కలసి పోటీచేయనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు పొత్తు ఖరారు అనంతరం కలసి ఒకే వేదికను పంచుకున్నాయి. 'భాజపా ద్వేషపూరిత రాజకీయాలను' ప్రజలు తిరస్కరిస్తారని ఈ సందర్భంగా అఖిలేశ్ విమర్శించారు.

RLD SP alliance: ఉత్తర్​ప్రదేశ్​లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ(ఎస్​పీ), రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల(ఆర్​ఎల్​డీ) మధ్య పొత్తు ఖరారైనట్లు ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు యూపీలోని మేరఠ్​లో జరిగిన ర్యాలీలో కలసి వేదికను పంచుకున్నాయి. వచ్చే ఎన్నికల అనంతరం రాష్ట్రం నుంచి భాజపా 'తుడిచిపెట్టుకుపోవడం' ఖాయమని ఇరు పార్టీలు ఉద్ఘాటించాయి.

UP Election 2022: రైతులకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల హక్కులు కల్పిస్తామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతులకు స్మారక చిహ్నం నిర్మిస్తామని ఆర్ఎల్​డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి తెలిపారు. భాజపా నేతలు సమాజంలో చీలికలు సృష్టిస్తున్నారని అఖిలేశ్ ఆరోపించారు. అయితే ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు సోదరభావాన్ని బలోపేతం చేస్తారని స్పష్టం చేశారు.

"భాజపా పాలనలో ప్రజలు ఎరువులు, మందులు, ఆక్సిజన్ పడకల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది. నోట్ల రద్దు సమయంలోనూ భారీ లైన్‌లో నిలబడ్డారు. అయితే ఈసారి భాజపాను అధికారం నుంచి దింపేందుకు ప్రజలు క్యూ కడతారు. భాజపా ద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారు."

అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు

"మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ఆర్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ వారసత్వాన్ని కాపాడేందుకు మా కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా."

--జయంత్ సింగ్ చౌదరి, ఆర్​ఎల్​డీ అధినేత

రైతు నిరసన నేపథ్యంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈ కూటమి.. భాజపాకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఎల్‌జేడీ సైతం..

రానున్న ఎన్నికల్లో ఎస్పీతో పాటు కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చలు జరుపనున్నట్లు లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) మంగళవారం ప్రకటించింది. తమకు పట్టున్న 19 జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది.

ప్రస్తుతం సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్‌ పార్టీలతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నామని.. ఈ కూటమిలో మరిన్ని పార్టీలు చేరే అవకాశం ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జావేద్ రజా, రాజ్యసభ సభ్యుడు ఎంవీ శ్రేయామ్స్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details