తెలంగాణ

telangana

ఈడీ కార్యాలయంలో ముగిసిన రాహుల్ గాంధీ విచారణ.. మంగళవారం మరోసారి..

By

Published : Jun 13, 2022, 9:47 AM IST

Updated : Jun 13, 2022, 10:38 PM IST

rahul-gandhi national herald case

22:03 June 13

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ సోమవారం ముగిసింది. దీంతో ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన బయటకు వచ్చారు. ఉదయం నుంచి దాదాపు 9 గంటలకు పైగా ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో విచారణకు మంగళవారం మరోసారి హాజరుకావాలని అధికారులు సమన్లు ఇచ్చినట్టు సమాచారం. సోమవారం విచారణలో కొన్ని ప్రశ్నలు కవర్‌ కాకపోవడంతో మంగళవారం మరోసారి విచారించనున్నట్టు తెలుస్తోంది.

భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రాహుల్‌, సోనియాలకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే, సోనియా అనారోగ్యం కారణంగా హాజరుకాకపోవడంతో సోమవారం రాహుల్‌ గాంధీ విచారణకు హాజరయ్యారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి తన సోదరి ప్రియాంకా గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి ప్రదర్శనగా ఆయన ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా.. ఉదయం 11.30గంటలకు విచారణ మొదలైంది. ఈ సందర్భంగా రాహుల్‌ను పలు ప్రశ్నలు అడిగిన అధికారులు.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం సెక్షన్‌ 50 ప్రకారం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మధ్యాహ్నం 2.10గంటలకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగించారు. మంగళవారం రెండో రోజు విచారణ జరగనుంది.

మరోవైపు, రాహుల్‌ని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దిల్లీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే నిరసనలకు చేపట్టాయి. ఆయనకు సంఘీభావంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వీధుల్లో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే, దిల్లీలో ఆందోళనలకు అనుమతి లేదంటూ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్‌ నేతలను అరెస్టు చేసిన పోలీసులు మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు.

15:53 June 13

భోజన విరామం తర్వాత మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్​ గాంధీ. భోజనం కోసం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసు నుంచి తుగ్లక్​ సేన్​లోని నివాసానికి వెళ్లిన రాహుల్​ గాంధీ.. అక్కడి నుంచి సర్​ గంగారామ్​ ఆసుపత్రికి వెళ్లారు. సోనియా గాంధీని కలిసిన అనంతరం తిరిగి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

14:41 June 13

భోజన విరామం..

నేషనల్​ హెరాల్డ్​ కేసులో 3 గంటల పాటు విచారణ తర్వాత ఈడీ కార్యాలయం వీడారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. భోజన విరామం ఇచ్చినట్లు ఈడీ వర్గాలు వెల్లడించారు. తుగ్లక్ లేన్ లోని నివాసానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. మనీలాండరింగ్​కు పాల్పడినట్లు ఆరోపణలతో ఇటీవల సమన్లు జారీ చేయగా.. సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు రాహుల్​. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు దాదాపు 3 గంటల పాటు విచారించింది ఈడీ.

సర్ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లారు రాహుల్ గాంధీ. గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనంతరం వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు సోనియా. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ల తో మాట్లాడి తెలుసుకున్నారని చెప్పాయి.

11:16 June 13

కాంగ్రెస్ కార్యకర్తల ప్లకార్డులు

ఈడీ ఆఫీస్​కు రాహుల్:
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్.. సైతం రాహుల్ వెంట ర్యాలీగా వెళ్లారు.

11:05 June 13

బయల్దేరిన రాహుల్:
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా ఈడీ కార్యాలయానికి పయనమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్.. రాహుల్ వెంట ర్యాలీగా వెళ్తున్నారు.

10:48 June 13

'దిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ... వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్'
కాంగ్రెస్ నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు. దిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని మోదీ సర్కారుపై కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. గాడ్సే వారసులు.. గాంధీ వారసత్వాన్ని సవాల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్​కు మోదీ ప్రభుత్వం భయపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సత్యం కోసం పోరాడుతోందని, దీన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈడీ అడిగే ప్రశ్నలన్నింటికీ ఎన్నికల్లో సమాధానం చెబుతామని అన్నారు.

10:20 June 13

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి రాహుల్:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ర్యాలీగా వెళ్లి ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మొదట పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సైతం కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు.పార్టీ సీనియర్ నేతలు రాహుల్​కు సంఘీభావంగా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలు 'రాహుల్​ జిందాబాద్' అంటూ నినాదాలతో హోరెత్తించారు.

అంతకుముందు, అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన చేపట్టారని పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ పోలీసులు వద్ద ఉన్న జాబితాలోని సీనియర్ నేతలకే అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. మరోవైపు, ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.

09:43 June 13

ఈడీ ఎదుట రాహుల్ హాజరు... దిల్లీలో హైటెన్షన్

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఉదయం 10గం.లకు రాహుల్ ఈడీ కార్యాలయానికి వెళ్లానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ.. ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. కాంగ్రెస్ నేతల ర్యాలీకి అనుమతి నిరాకరించిన దిల్లీ పోలీసులు... ఆ పార్టీ కార్యాలయాన్ని బారిగేట్లతో దిగ్బంధించారు.

దిల్లీ పోలీసులు వద్ద ఉన్న జాబితాలోని సీనియర్ నేతలకే అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, సీడబ్ల్యుసీ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

Last Updated :Jun 13, 2022, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details