తెలంగాణ

telangana

'ఏడాదిలోపు పిల్లల్ని కనండి లేదా రూ.5 కోట్లు ఇవ్వండి'

By

Published : May 12, 2022, 8:33 AM IST

Parents move court against son and daughter-in-law for demand grandchildren

Parents Demand For Grandchildren: మనవళ్లతో ఆనంద క్షణాల్ని గడపాలని కోరుకుంటున్న ఓ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని లేదా వారిపై తాము వెచ్చించిన 5 కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని ఉత్తరాఖండ్​లోని హరిద్వార్ జిల్లా కోర్టులో ఆ దంపతులు పిటిషన్ దాఖలు చేశారు.

Parents Demand For Grandchildren: ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​ జిల్లా కోర్టులో అరుదైన పిటిషన్​ దాఖలైంది. హరిద్వార్​కు చెందిన వృద్ధదంపతులు.. తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని డిమాండ్​ చేశారు. అది నెరవేర్చకపోతే.. వారిపై తాము ఖర్చు చేసిన రూ.5 కోట్లను పరిహారంగా చెల్లించాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

హరిద్వార్​కు చెందిన సంజీవ్ రంజన్ ప్రసాద్ బీహెచ్​ఈఎల్​లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం తన భార్య సాధనతో కలిసి హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. ఆ దంపతుల ఏకైక కుమారుడు శ్రేయ్ సాగర్‌కు నోయిడా నివాసి శుభాంగి సిన్హాతో 2016లో వివాహం చేశారు. శ్రేయ్​సాగర్​ పైలట్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, వివాహం జరిగి ఆరేళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవటం, ఆ దిశగా కొడుకు, కోడలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవటంపై విసిగిపోయిన రంజన్ దంపతులు కోర్టు మెట్లు ఎక్కారు.

పిటిషన్​ దాఖలు చేసిన దంపతులు

'నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు'..సంజీవ్ రంజన్ ప్రసాద్ తన డబ్బుంతా కుమారుడు చదువు కోసమే వెచ్చించానని, అమెరికాలో శిక్షణ ఇప్పించానని తెలిపారు. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో అప్పు తీసుకున్నానని, చాలా ఆర్థిక ఇబ్బందల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ వృద్ధ దంపతులు హరిద్వార్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, అతడి కుమారుడికి పెళ్లి అయ్యి ఆరేళ్లు గడిచినా సంతానం కలగలేదని చెప్పారు. కుమారుడు, కోడలు బిడ్డ కోసం ఎలాంటి ప్లానింగ్ చేయడం లేదని తెలిపారు.

అలాగే, తమ కుమారుడిని పెంచి, సమర్థుడిని చేసేందుకు తమ డిపాజిట్లన్నింటినీ పెట్టుబడిగా పెట్టామని వృద్ధ దంపతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వయసులో తాము ఒంటరిగా జీవించవలసి వస్తోందని, ఇది చాలా బాధాకరమైనదని అన్నారు. తమ కుమారుడు, కోడలు మనవళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మగపిల్లా, ఆడపిల్లా అన్నది తమకు పట్టింపు లేదని, అలా చేయకుంటే తాము ఖర్చు చేసిన రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పిటిషన్ మే 17న విచారణకు రానుంది.

ఇవీ చదవండి:వైవాహిక అత్యాచారం నేరమా? కాదా? ఎటూ తేల్చని హైకోర్టు!

దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే

ABOUT THE AUTHOR

...view details