తెలంగాణ

telangana

Odisha Train Accident Reason : 'ప్రమాదానికి కారకుల్ని గుర్తించాం'.. రైల్వే మంత్రి వెల్లడి

By

Published : Jun 4, 2023, 11:14 AM IST

Updated : Jun 4, 2023, 2:21 PM IST

odisha train accident reason

Odisha Train Accident Reason : ఒడిశా ఘోర రైలు ప్రమాదానికి కారకులను గుర్తించామని చెప్పారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని వివరించారు.

Odisha Train Accident Reason : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌లో మార్పు వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి ఆదివారం చెప్పారు. ఈ ప్రమాదానికి కవచ్​తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రమాదానికి శనివారం బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పిన కారణం కాదని.. ఇంటర్ లాకింగ్​లో మార్పు వల్లే జరిగిందని స్పష్టం చేశారు.

"ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రమాదస్థలిని పరిశీలించి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ప్రధాని సూచనల మేరకు ట్రాక్‌ను పునరుద్ధరించే పని వేగంగా జరుగుతోంది. ఈ రోజు ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మధ్యాహ్నం 12.05 గంటలకు డౌన్ మెయిల్​​ లైన్​ను పునరుద్ధరించాం. వ్యాగన్లు, కోచ్‌లు అన్నింటినీ ఇక్కడి నుంచి తరలించారు. మృతదేహాలను కూడా ఇక్కడి నుంచి తరలించాం. ప్రత్యేక ఆపరేషన్‌ త్వరితగతిన జరుగుతోంది. బుధవారం ఉదయం నాటికి ట్రాక్‌ను పూర్తిగా పునరుద్ధరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బుధవారం ఉదయం పూర్తి పునరుద్ధరణ పూర్తై రైళ్లు సాధారణంగా తిరగాలని భావిస్తున్నాం. దర్యాప్తు కూడా పూర్తవుతోంది. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు నివేదిక వీలైనంత త్వరగా అందజేస్తారు. ఇంతటి విషాదమైన భయానకమైన ప్రమదానికి కారణమేంటన్నది ఇప్పటికే గుర్తించాం. ఈ సమయంలో నేను ప్రమాద కారణాలపై ఇంకా మాట్లాడడం సమంజసం కాదు. దర్యాప్తు నివేదిక అందనివ్వండి. కానీ ప్రమాదానికి గల కారణాలను, అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్పు ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అన్నది దర్యాప్తులో తేలుతుంది.

--అశ్విని వైష్ణవ్‌, రైల్వే మంత్రి

మృతులు 288 కాదు..275
ఒడిశా బాలేశ్వర్​ జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288 కాదని.. 275 అని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర సీఎస్​ ప్రదీప్ జెనా. కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కపెట్టడం వల్ల ఇలా జరిగిందని ఆయన తెలిపారు. మార్చురీలో ఉన్న మృతదేహాలన్నింటికీ.. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్​ ఆధ్వర్యంలో డీఎన్​ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 275లో 88 మృతదేహాలను ఇప్పటికే గుర్తించామన్నారు. 1,175 మంది గాయపడగా.. వారిలో 793 మంది చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారని వివరించారు.

Modi Odisha Train Accident : బాలేశ్వర్​ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఘటనా స్థలంలో ఉన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​కు ఆదివారం ఫోన్​ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఒడిశా రైలు ప్రమాద స్థలంలో ట్రాక్​ పునరుద్ధరణ పనులను అశ్విని వైష్ణవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. రాత్రంతా అక్కడే ఉండి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం రాత్రి నుంచి వెయ్యి మందికిపైగా కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. చీకట్లో పనులకు ఇబ్బంది కలగకుండా.. పెద్ద లైట్లను ఏర్పాటు చేశారు. ఏడు ప్రొక్లెయిన్లు, రెండు యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు, 3 నుంచి 4 రైల్వే, రోడ్డు క్రేన్లను పునరుద్దరణ పనులకు ఉపయోగించారు.

'ఒకే మంత్రి ఇన్ని శాఖలు నిర్వహించలేరు'
బాలేశ్వర్​లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్​. ఒకే మంత్రి.. రైల్వేలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్​, కమ్యూనికేషన్స్​ లాంటి పెద్ద మంత్రిత్వ శాఖలను నిర్వహించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. బుల్లెట్ రైళ్లు, వందే భారత్​ లాంటి అసాధరణమైనవి కాకుండా.. సాధరణమైన వాటిపై కూడా దృష్టి పెట్టాలని హితవు పలికారు.

సింగపూర్ ప్రధాని సంతాపం
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై సింగపూర్​ ప్రధానమంత్రి లీ సైన్​ లూంగ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఇవీ చదవండి :Odisha Train Accident : దిల్లీ నుంచి వైద్యులు, మందులు.. ఎయిర్​ ఫోర్స్​ విమానంలో భువనేశ్వర్​కు..

సెలవుపై రైలులో ఇంటికెళ్తూ జవాన్ సాహసం.. అధికారులకు ఫస్ట్ అలర్ట్.. ఒంటరిగా రెస్క్యూ ఆపరేషన్

Last Updated :Jun 4, 2023, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details