తెలంగాణ

telangana

'త్వరలో భాజపాయేతర సీఎంల భేటీ!'

By

Published : Apr 18, 2022, 9:02 AM IST

Non-BJP CMs Meeting

Non BJP CMs Meeting: ముంబయి వేదికగా భాజపాయేతర ముఖ్యమంత్రుల భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు రౌత్‌ వెల్లడించారు.

Non BJP CMs Meeting: భారతీయ జనతా పార్టీని రాజకీయంగా అడ్డుకోవడానికి ఏకం కావాలన్న విపక్షాల ప్రయత్నాలకు ముందడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భాజపాయేతర ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కానున్నారు. ఇందుకు ముంబయి వేదిక కానుంది. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. భాజపాకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుతూ గతంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కలిసి చర్చించారని, ఇందులో భాగంగా ముంబయిలో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రౌత్‌ వివరించారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు రౌత్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లోనే ఒక వర్గం ఓటర్లను సమీకరించేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా, దేశంలో ఇటీవల చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపర హింసపై కాంగ్రెస్‌ సహా 13 విపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో భాజపాయేతర సీఎంలు భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి:'భాజపాతో కాంగ్రెస్ సీనియర్ల కుమ్మక్కు- మీ పార్టీలో ఇక నేనుండను!'

ABOUT THE AUTHOR

...view details