తెలంగాణ

telangana

కదులుతున్న బస్సులో పురుడు పోసిన లేడీ కండక్టర్​.. నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ!

By

Published : May 17, 2023, 11:31 AM IST

pregnant delivery a baby in bus in karnataka
pregnant delivery a baby in bus in karnataka

కదులుతున్న బస్సులో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. బస్సులో ఉన్న కండక్టర్​ సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. అంబులెన్స్​ వచ్చేలోపే ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరో ఘటనలో బంగాల్​కు చెందిన వైద్యులు.. పురిటి నొప్పులు లేకుండానే ఓ మహిళకు నార్మల్​ డెలివరీ చేశారు.

ఓ లేడీ కండక్టర్​ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. కదులుతున్న బస్సులో ఉన్నట్టుండి ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్​ ఆమెకు సహాయం చేసి నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చేశారు. ఆ తర్వాత బస్సులోని ప్రయాణికుల వద్ద నుంచి రూ.1,500 సేకరించి ఆమెకు ఆర్థికసాయం చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

కేఎస్​ఆర్టీసీకి చెందిన ఓ బస్సు సోమవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తోంది. ఆ సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఓ నిండు గర్భిణీ కూడా ఉంది. అయితే బస్సు వెళ్తున్న సమయంలో ఆ గర్భిణీకి ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. చాలా కిలోమీటర్ల వరకు ఎటువంటి ఆస్పత్రులు లేవు. దీంతో చేసేదేమీ లేక మహిళా కండక్టర్ బస్సును రోడ్డు పక్కన ఆపించి.. ప్రయాణికులందరినీ కిందకు దిగమని చెప్పింది. ఆ తర్వాత బస్సులోనే ఆమెకు ప్రసవం చేసింది. దీంతో గర్భిణీ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆర్థిక సమస్యల కారణంగా ఆ గర్భిణి ప్రైవేట్​ వాహనంలో ఆస్పత్రికి వెళ్లలేక కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించింది. విషయం తెలుసుకున్న కండక్టర్​.. బస్సులోని ప్రయాణికుల వద్ద నుంచి రూ.1,500 సేకరించి ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆమె తన బిడ్డతో కలిసి అంబులెన్సులో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. సకాలంలో స్పందించి తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న కండక్టర్ గురించి తెలుసుకున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిషనర్, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

కదులుతున్న బస్సులో పురుడు పోసిన కండక్టర్

నొప్పి లేకుండా నార్మల్​ డెలివరీ!
ప్రస్తుత కాలంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా సిజేరియన్​ ప్రసవాలే అధికంగా జరుగుతున్నాయి. దీనికి తోడు పురిటి నొప్పులు అధికంగా ఉన్నందున చాలా మంది గర్భిణీలు సాధారణ డెలివరీని కోరుకోకుండా.. సిజేరియన్​లకు వెళ్తున్నారు. అయితే బంగాల్​లోని ఓ ప్రభత్వాస్పత్రిలోని వైద్యుల బృందం ఎటువంటి ప్రసవ వేదన లేకుండా ఓ గర్భిణీకి నార్మల్​ డెలివరీ చేసింది.

అసన్​సోల్​ జిల్లా ఆస్పత్రికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ వినీతా కుమారి, అనస్థీషియా డాక్టర్ రిషికేష్​ మిత్రలు కలిసి ప్రయోగాత్మకంగా మహిళకు ప్రసవ వేదన లేకుండా నార్మల్​ డెలివరీ చేశారు. ఆదివారం నేహా ఖతున్​ అనే గర్భిణీకి వైద్య బృందం.. ఎపిడ్యూరల్ అనస్థీషియా పద్ధతిలో నొప్పిలేకుండా సాధారణ ప్రసవం చేశారు. ఈ పద్ధతిలో డెలివరీ చేయడం తమ ఆస్పత్రిలో ఇదే మొదటిసారి అని సూపరింటెండెంట్‌ నిఖిల్‌ చంద్ర దాస్‌ తెలిపారు.

ఈ అనస్థీషియా ప్రక్రియలో గర్భిణులకు పొత్తికడుపు కింద నుంచి కాళ్ల వరకు తిమ్మిరిగా ఉంటుందని, అయినప్పటికీ స్పృహలోనే ఉంటారని వైద్యులు తెలిపారు. గర్భిణీ సాధారణ డెలివరీ కోసం తన పొట్టపై ఒత్తిడి చేయగలదని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రతీది సహజంగా జరుగుతుందని.. గర్భిణీకి ఎటువంటి నొప్పి ఉండదని ఆస్పత్రి సూపరింటెండెంట్​ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని నొప్పిలేని సాధారణ డెలివరీలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఆస్పత్రికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా గర్భిణీలు ప్రసవం కోసం వస్తుంటారని సూపరింటెండెంట్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details