IPC CRPC Evidence Act New Bill : వలస పాలన తాలూకు గుర్తులను చెరిపేస్తూ భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే దిశగా కీలక ముందడుగు పడింది. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి-IPC, నేర శిక్షాస్మృతి-CRPC, సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్త శాసనాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్రం.. భారతీయ న్యాయ సంహిత-BNS, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-BNSS, భారతీయ సాక్ష్యా-BS పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు.
IPC CRPC Evidence Act To Be Replaced : పౌరహక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రజల సమకాలీన అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వాటికి రూపకల్పన చేసినట్లుకేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే ప్రతిఒక్కరికీ గరిష్ఠంగా మూడేళ్లలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నూతన బిల్లులను.. లోక్‌సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా అమిత్ షా పలు వివరాలను వెల్లడించారు. బ్రిటిష్ వలస పాలకుల గుర్తులను చెరిపేస్తామని నిరుడు ఎర్రకోట పైనుంచి ప్రధాని మోదీ వాగ్దానం చేశారని, అందులో భాగంగానే IPC, CRPC, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో మూడు కొత్త బిల్లులు తెచ్చామన్నారు. వీటిలో 313 సవరణలు చేశామన్నారు. దీనివల్ల నేర న్యాయ వ్యవస్థలో సంపూర్ణ మార్పులు వస్తాయని, పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు జవాబుదారీతనంతో వ్యవహరించేలా కొత్త బిల్లుల్లో నిబంధనలు పొందుపరిచామని తెలిపారు. పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఆంక్షలు తీసుకొచ్చామన్నారు. రాజద్రోహ సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్లు వివరించిన ఆయన వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
తాజా బిల్లుల్లో మరిన్ని కీలక అంశాలను పొందుపర్చారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, పదవులు, పదోన్నతులు ఇప్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, లేని హోదాలను చెప్పి మోసగించి లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోవడం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. సామూహిక అత్యాచారాలకు తెగబడితే.. 20 ఏళ్ల జైలుశిక్ష లేదంటే యావజ్జీవ కారాగారం విధించవచ్చు. 18 ఏళ్లలోపు వారిపై అత్యాచారాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించడానికి కూడా వీలుంటుంది. మూకదాడులకు పాల్పడినవారికి ఏడేళ్లు లేదా జీవితఖైదు విధించేందుకు, అవసరమైతే మరణశిక్ష ఖరారు చేసేందుకూ అవకాశముంది. మొబైల్, బంగారు గొలుసుల తస్కరణ కేసుల్లో నిందితులకు శిక్ష విధించడానికి ఇప్పటివరకూ ఎలాంటి నిబంధన లేదు. ఆ తరహా నేరాలనూ కొత్త బిల్లుల్లో చేర్చారు.
ఆయుధంతో చిన్నగా గాయపరిచినా, మనిషి కోమాలోకి వెళ్లేంతగా గాయపరిచినా ఇప్పటివరకూ సెక్షన్-324 కింద ఏడేళ్ల శిక్షకు వీలుండేది. ఇకపైచిన్న, పెద్ద గాయాలను వేరుచేసి చూపుతారు. గాయపరచడంవల్ల బ్రెయిన్‌డెడ్ అయ్యే పరిస్థితి వస్తే కనీసం 10 ఏళ్లు.. లేదంటే జీవితఖైదు విధించే నిబంధన పొందుపరిచారు. పిల్లలపై నేరాలు చేసేవారికి శిక్షను 7 నుంచి 10 ఏళ్లకు చేర్చారు. జరిమానానూ భారీగా పెంచారు. ఎవరికైనా దోపిడీ, దొంగతనాలు, ఇతర ఆర్థిక నేరాల్లో శిక్షపడితే ఆ నేరం ద్వారా వారు సంపాదించిన సొత్తునంతా స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేసే వీలుంటుంది. లైంగిక హింస కేసుల్లో బాధితురాలి వాంగ్మూలం.. ఆమె ఇంట్లోనే మహిళా పోలీసు అధికారి ఆధ్వర్యంలో మహిళా మేజిస్ట్రేట్ ద్వారా నమోదుచేస్తారు. ఆ సమయంలో.. బాధితురాలి తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండొచ్చు. SMS., ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేయడం వీలవుతుంది.