తెలంగాణ

telangana

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

By

Published : Aug 15, 2022, 7:31 AM IST

Updated : Aug 15, 2022, 8:23 AM IST

MODI FLAG HOISTING
MODI FLAG HOISTING ()

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Indian independence day 2022: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రకోట వద్దకు విచ్చేసే ముందు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు ప్రధాని. రాజ్​ఘాట్​కు వెళ్లిన మోదీ.. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

రాజ్​ఘాట్ వద్ద మోదీ

స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ప్రభుత్వం 'ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌' పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేడుకలకు కొత్త శోభను తీసుకొచ్చింది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్‌-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.

రాజ్​ఘాట్ వద్ద మోదీ

భద్రత కట్టుదిట్టం..
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వేడుకలకు హాజరయ్యే ఏడువేల మంది కోసం బహుళ అంచెల భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ కవళికలను గుర్తించే కెమెరాలు, వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో 'నో కైట్‌ ఫ్లై జోన్‌'గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్‌ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్‌ షూటర్స్‌, ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, మెరికల్లాంటి స్వాట్‌ కమాండోలు, డాగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించారు.

డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్‌లను గుర్తించి, నేలకూల్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతరులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ ఉన్న 8 మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్‌ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. పారా గ్లైడింగ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, రిమోట్‌ పైలట్‌ ఎయిర్‌ క్రాప్ట్‌లపై మంగళవారం వరకు నిషేధం విధించారు.

ఇదీ చదవండి:

Last Updated :Aug 15, 2022, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details