తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫాస్టర్'​కు సీజేఐ శ్రీకారం- ఉత్తర్వులు మరింత సురక్షితంగా, వేగంగా..

Faster Software: సుప్రీంకోర్టు జారీచేసే ఉత్తర్వులను అధికారులకు వేగంగా, సురక్షితంగా పంపేందుకు రూపొందించిన 'ఫాస్టర్​' సేవలను ప్రారంభించారు సీజేఐ జస్టిస్​ ఎన్​.వి. రమణ. జులై 16న వేగంగా ఉత్తర్వులను అందించే వ్యవస్థను రూపొందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ 'ఫాస్టర్​'ను రూపొందించారు.

cji ramana
సీజేఐ రమణ

By

Published : Apr 1, 2022, 8:15 AM IST

Faster Software: సుప్రీంకోర్టు జారీచేసే మధ్యంతర, స్టే, బెయిల్‌ ఉత్తర్వులను సంబంధిత అధికారులకు వేగంగా, సురక్షితంగా పంపేందుకు కొత్తగా రూపొందించిన డిజిటల్‌ వేదిక 'ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌ (ఫాస్టర్‌)'ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గురువారం ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జైలులో ఉన్న నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తూ 2021 జులై 8న ఉత్తర్వులు జారీచేయగా.. 3 రోజుల తర్వాత కూడా అవి అందలేదన్న కారణంతో జైలు అధికారులు నిందితులను విడుదల చేయలేదు. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం 2021 జులై 16న వేగంగా ఉత్తర్వులను అందించే వ్యవస్థను రూపొందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంది.

"ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కోర్టు ఉత్తర్వులను చేరవేయడానికి పావురాల కోసం ఆకాశంవైపు ఎందుకు ఎదురుచూడాలి?" అని అప్పట్లో సీజేఐ వ్యాఖ్యానిస్తూ 'ఫాస్టర్‌' విధానం అమలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించి.. రెండు వారాల్లోగా సమర్పించాలని సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. ధర్మాసనం ఆదేశాలను అనుసరించి నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్​తో (ఎన్‌ఐసీ) కలిసి యుద్ధప్రాతిపదికన 'ఫాస్టర్‌'ను అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థను దేశంలోని అన్ని జిల్లాలకు తీసుకెళ్లడానికి ఇంతవరకు వివిధ స్థాయిల్లో 73 మంది నోడల్‌ అధికారులను నియమించారు. వీరందరినీ ఒక ప్రత్యేక జ్యుడీషియల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థ కోసం దేశవ్యాప్తంగా ఇంతవరకు 1,887 ఈమెయిల్‌ ఐడీలు సృష్టించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ప్రత్యేకంగా 'ఫాస్టర్‌'సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇది కోర్టు ప్రొసీడింగ్స్‌, బెయిల్‌ ఆర్డర్లను ఈమెయిల్‌ ద్వారా నోడల్‌ అధికారులకు పంపుతుంది. దీనివల్ల సమయం వృథాకాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు వేగంగా చివరి అధికారికి అందుతాయి. ఈ నూతన వ్యవస్థను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సహచర న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తలతో కలిసి ప్రారంభించారు.

ఇదీ చూడండి :వీడ్కోలు వేదికపై పాటలతో అలరించిన రాజ్యసభ ఎంపీలు

ABOUT THE AUTHOR

...view details