ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్లల్లోనే వర్షపు నీరు.. పస్తులతో తప్పని జాగారం...

By

Published : Sep 17, 2020, 6:27 PM IST

వారం రోజులుగా కురుస్తున్న వర్షం ఆగింది. కానీ నీరు ఆగలేదు. వీధుల్లో, రోడ్లపైన, నివాసాల్లో మోకాళ్ల లోతు ఉండటంతో కడప నగరంలోని మృత్యుంజయ కుంట వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంట్లోని సామానంతా తడిసిపోయి.. పొయ్యి వెలిగించుకుని వంట చేసుకునే వీలు లేక పస్తులుంటూ ఆ నీటిలోనే జాగారం చేస్తున్నారు. తాము ఇన్ని ఇబ్బందులు పడుతున్నా.. ఒక అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ తమవైపు చూడలేదని వాపోతున్నారు.

rain water in houses at mrtunjaya kunta kadapa
కడపలో వర్షాలు

గత వారం రోజులుగా కడపలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరం నడిబొడ్డున ఉన్న మృత్యుంజయ కుంట నీటమునిగింది. ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా వాన నీరే కనిపిస్తోంది. సరైన మురుగు నీటి వ్యవస్థలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

కడపలో వర్షాలు

మృత్యుంజయ కుంటలో నివాసాలు లోతట్టు ప్రాంతంలో, మురికి కాలువలు ఎత్తులో ఉండటంతో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి వచ్చి చేరింది. నీరు పోయేందుకు అవకాశం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లోని వంట సామగ్రి, ఇతర సామాన్లు తడిసిపోయాయి. అక్కడ ఉండలేక కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరికొంతమంది మోటర్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details