ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎమ్యెల్యేలకు ఎర' కేసులో మరో ఇద్దరికి నోటీసులు

By

Published : Nov 23, 2022, 9:44 AM IST

TRS MLAs purchase case updates: తెలంగాణలోని తెరాస ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్​కు..​ విచారణకు హాజరు కావడంలో ఇబ్బందేమిటని హైకోర్టు ప్రశ్నించింది. విచారణకు హాజరై తెలిసిన వివరాలను వెల్లడించవచ్చని పేర్కొంది. వారికి అరెస్టు నుంచి రక్షణ ఉందని, కావాలంటే మరో రెండు రోజులు గడువు కోరడానికి అవకాశం ఉందని సూచించింది.

Telangana high court
తెలంగాణ హైకోర్టు

TRS MLAs purchase case updates: తెలంగాణలోని తెరాస ఎమ్మెల్యేల ఎర కేసులో విచారణకు హాజరు కావడంలో ఇబ్బందేమిటంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌ను హైకోర్టు ప్రశ్నించింది. విచారణకు హాజరై తనకు తెలిసిన వివరాలను వెల్లడించవచ్చు కదా అని పేర్కొంది. అరెస్ట్‌ నుంచి రక్షణ కూడా ఉందని, కావాలంటే మరో రెండు రోజులు గడువు కోరడానికి అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

సిట్‌ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌, కేసు దర్యాప్తునకు దిల్లీ పోలీసులు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లతోపాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయమూర్తి ఆరా తీయగా, సిట్‌ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టిందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. ఈ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై సత్వరం విచారణ పూర్తి చేయాలని సూచించిందన్నారు. ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదన్నారు. భాజపాకు చెందినవారు దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పారు.

నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదన్నారు. దిల్లీ పోలీసుల తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ సంతోష్‌కు దిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో హేమేందర్‌ అనే వ్యక్తికి నోటీసులు అందజేసినట్లు చెప్పారు. సంతోష్‌ గుజరాత్‌లో ఉండటంతో విచారణకు హాజరయ్యేందుకు కుదరలేదని భాజపా న్యాయవాది చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించాక పిటిషన్లపై విచారణ చేపడతామని న్యాయమూర్తి అన్నారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

సిట్‌ దర్యాప్తును నిలిపివేయాలంటూ నిందితుల పిటిషన్‌:ఈ కేసులో సిట్‌ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో నిందితుల తరఫున న్యాయవాది వి.కృష్ణ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేస్తోందన్నారు.

సిట్‌ అధినేత సీ.వీ.ఆనంద్‌ తదుపరి డీజీపీ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదని.. ఆయన స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న సిట్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి ఉందన్నారు. డివిజన్‌ బెంచ్‌ జారీ చేసిన ఉత్తర్వులపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిందితులు కాని వ్యక్తులకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఈ విషయం మీడియాలో వచ్చిందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details