ముస్లింలకు జగన్​ సర్కారు మొండి చెయ్యి.. నిబంధనల పేరుతో పథకాలకు చెక్​

author img

By

Published : Nov 23, 2022, 7:28 AM IST

ముస్లింలను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది

minority financial institutions were crippled in AP:రాష్ట్రంలో 8.8 శాతం జనాభా ఉన్న ముస్లింలను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది. తెలుగుదేశం హయాంలో అమలైన రంజాన్‌ తోఫా సహా వివిధ పథకాల అమలును నిలిపివేశారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు, స్వయం ఉపాధి రుణాలు, కడపలో హజ్‌ భవనం నిర్మాణం సహా.. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించారు. అందరికీ వర్తించే నవరత్నాలు మాత్రమే ముస్లింలకూ ఇస్తూ సరిపెడుతున్నారు. వైఎస్ఆర్ షాదీ తోఫా, విదేశీ విద్యాదీవెన పథకాల్లో నిబంధనలు సడలింపుపై ముస్లింల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారు.

ముస్లింలను మోసం చేస్తున్న వైకాపా ప్రభుత్వం

YSRCP government is cheating Muslims: ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీలపై లెక్కలేనన్ని హామీలు గుప్పించిన జగన్.. అధికారంలోకి రాగానే మరిచిపోయారు. ఇప్పటిదాకా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే అన్ని మసీదులకు చెందిన ఇమాంలకు 10 వేలు, మౌజంలకు 5 వేలు ఇస్తామన్న మాటనూ పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేదు. జగన్‌ సీఎం అయిన ఏడాదిన్నరకు ఇమాంలు, మౌజంలకు వేతనాల పెంపును అమలు చేసినా.. పాదయాత్రలో చెప్పినట్లు అన్ని మసీదులకు ఇవ్వలేదు. గౌరవవేతనం ఇవ్వాలంటూ ఆదాయం లేని 2 వేల మసీదుల్లోని ఇమాంలు, మౌజంలు విన్నవించినా పట్టించుకోలేదు. వారి గురించి అధికారులు నివేదించినా పక్కనపెట్టేశారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి ముస్లింలను ఆర్థికంగా ఆదుకుంటామని, వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మడత పెట్టేశారు. గతంలో ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా ముస్లిం యువతకు లక్ష వరకు రాయితీపై రుణాలివ్వగా.. ఇప్పుడు ఆ ఊసే లేదు.

పండుగ నాడు పేద ముస్లింలకు అండగా ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం రంజాన్‌ తోఫా అమలు చేసింది. నిత్యావసరాలతో కూడిన ప్రత్యేక కానుకను సుమారు 12 లక్షల 50 వేల మంది ముస్లింలకు.. రంజాన్‌ పండుగ సమయంలో ఉచితంగా అందించింది. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆ పథకాన్ని రద్దు చేసి పేద ముస్లింల పొట్టకొట్టింది. గత ప్రభుత్వంలో ముస్లింలకు ఆర్థిక భరోసాగా నిలిచిన మైనారిటీ ఆర్థిక సంస్థను.. జగన్‌ అధికారం చేపట్టగానే నిర్వీర్యం చేశారు. ఏటా నిధులు కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపిస్తూ, నవరత్నాలకు మళ్లిస్తున్నారు. ఒక్కరికీ స్వయం ఉపాధి రాయితీ రుణం ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఆఖర్లో మంజూరుచేసిన రాయితీ రుణాల్ని కూడా రద్దు చేసింది. ముస్లిం సంఘాల నుంచి వినతులు అందినా పట్టించుకునే వారే లేరు. వాహనమిత్ర వాహనాల పంపిణీలో మాత్రమే కొంతమందికి రాయితీ వర్తింపచేశారు.

ముస్లిం సంఘాలు, ప్రజాపక్షాల ఒత్తిడితో ఇటీవలే అమల్లోకి తెచ్చిన వైఎస్ఆర్ షాదీ తోఫా, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాలకు.. సీఎం జగన్‌ నిబంధనల కత్తెర వేశారు. గత ప్రభుత్వంలో దుల్హన్‌ పథకం ముస్లింలలో 99 శాతం అర్హత సాధించేందుకు వీలుగా ఉందని, ఇప్పుడు అమలు చేసిన వైఎస్సార్‌ షాదీ తోఫా నిబంధనలు చాలా మంది పేద ముస్లింలను పథకానికి దూరం చేస్తున్నాయని ముస్లిం సంఘాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి. జగనన్న విదేశీ విద్యాదీవెనలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటివరకు 54 మంది ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే... 21 మందికి మాత్రమే అర్హత ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అర్హత సాధించి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన కొంతమందికి వైకాపా ప్రభుత్వం మధ్యలోనే సాయాన్ని నిలిపేసింది. సాయం కోసం ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కనికరించలేదు. విజిలెన్స్‌ విచారణ పేరుతో మూడున్నరేళ్లుగా కాలం గడిపిందే తప్ప... అర్హులైన వారికి గుర్తించి సాయాన్ని పునరుద్ధరించలేదు. ఎన్నికల జిమ్మిక్కుగా పథకాలు అమలు చేయాలన్న ఆలోచనే తప్ప... ముస్లింలకు నిజంగా లబ్ధి చేకూర్చాలనే ఆలోచన లేదని ముస్లిం సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మసీదులు, దర్గాల మరమ్మతులు, శ్మశానవాటికల నిర్మాణాలకు.. 2016 - 19 మధ్య 648 వక్ఫ్‌ సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 50 కోట్లకు పైగా కేటాయించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక మరమ్మతులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా.. గ్రాంట్‌ మాత్రం ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో మసీదులు కట్టినవారు కొందరు కోర్టును ఆశ్రయించగా.. వారికి మాత్రమే నిధులు విడుదల చేశారు. మిగతా వారికి ఇప్పటికీ ఇవ్వడం లేదు.

వైకాపా సర్కార్ వచ్చాక 9 వక్ఫ్‌ సంస్థలకు 86 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల నుంచి 100కిపైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ... త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఇటీవల ప్రకటించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు కోటి చొప్పున కేటాయిస్తామన్నారు. వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ గోడలు కడతామన్న ముఖ్యమంత్రి మాట అటకెక్కింది. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక మొదటి బడ్జెట్‌లో కేటాయించిన 20 కోట్లతో... ఒకటి, రెండు స్థలాలకు గోడులు ఏర్పాటు చేసి మిగిలినవి పక్కనపెట్టేశారు.

ముస్లింలకు ప్రత్యేక భరోసా ఇచ్చేందుకు చొరవ చూపని ప్రభుత్వం.. రాజకీయ ఉపాధి కల్పనకు మాత్రం మైనారిటీ సంక్షేమశాఖను బాగా వాడుకుంది. ఇప్పటివరకు వివిధ శాఖలకు ఒక్కొక్కరినే సలహాదారుగా పెట్టిన ప్రభుత్వం.. మైనారిటీ సంక్షేమశాఖకు ఇద్దరిని కేటాయించింది. వారికి క్యాబినెట్‌ హోదానూ కట్టబెట్టింది. నెలకు జీతభత్యాలు, ఇతర అలవెన్స్‌ల కింద 3 లక్షల చొప్పున ఖర్చు చేస్తోంది. పేద ముస్లింలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మాత్రం వెనకాడుతోంది. పరిపాలన వ్యవహారాల్ని సకాలంలో చక్కబెట్టేందుకు శాఖలోని హెచ్​ఓడీ కార్యాలయాల్లో పూర్తి అధికారుల్ని నియమించకుండా... ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు.

మైనారిటీ కమిషన్, వక్ఫ్‌బోర్డు ప్రధాన శాఖలకు ఏఫ్ఏసీ లతోనే సరిపెట్టారు. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో గత ప్రభుత్వ హయాంలో 25 కోట్ల వ్యయంతో హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టగా... 2019 ఎన్నికల నాటికే దాదాపు పూర్తయింది. వైకాపా అధికారం చేపట్టి మూడున్నరేళ్లు దాటుతున్నా... దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 10 కోట్లు కావాలని ఇటీవల కడప కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించడం కొసమెరుపు. ముస్లిం సంఘాల విజ్ఞప్తితో విజయవాడలో 80 కోట్లతో మరో హజ్‌హౌస్‌ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం మొగ్గుచూపగా... వైకాపా సర్కార్ దాన్నీ పక్కనపెట్టింది.

ఇవీ చదవండి:

ఈ నెల 27న మంగళగిరికి పవన్​.. ఇప్పటం బాధితులకు పరిహారం

పెరిగిన సముద్రపు ఉప్పు ధరలు.. రైతుల్లో సంతోషం.. కానీ వ్యాపారులకు

నేవీ డే వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ సాగర తీరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.